సీఎం కేసీఆర్ స‌ర్వే చేయించారా… ఫ‌లిత‌మేంటి?

స‌ర్వేలు చేయించుకోవడం ముఖ్య‌మంత్రి కేసీఆర్ కి అల‌వాటు. మంత్రులూ నాయ‌కుల ప‌నితీరుపైనా, ప్ర‌భుత్వ పాల‌న‌పైనా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జాభిప్రాయం తెలుసుకుంటూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందైతే, స‌ర్వేల ఆధారంగానే టిక్కెట్లు కేటాయింపులు చేశారు. అయితే, రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక ఇంత‌వ‌ర‌కూ స‌ర్వేల అవ‌స‌రం సీఎం కేసీఆర్ కి ప‌డ‌లేదు! కానీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల వ‌స్తున్న నేప‌థ్యంలో స‌ర్వేల‌పై మ‌రోసారి ఆధాప‌డుతున్న‌ట్టు తెరాస వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా, ఏవొచ్చినా త‌మ‌దే గెలుపు అనే ధీమాతో తెరాస గెలుచుకుంటూ వ‌చ్చింది. కానీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెరాస వేసుకున్న లెక్క‌లు త‌ప్పాయి. సారు కారు ప‌ద‌హారు సాకారం కాలేదు. ఇప్పుడు మున్సిప‌ల్ ఎన్నిక‌లు వ‌స్తుండ‌టంతో… ఈసారి లెక్క‌లు ప‌క్కాగా ఉండాల‌నే వ్యూహంతో సీఎం కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే, తాజాగా ఓ స‌ర్వే చేయించిన‌ట్టుగా తెలుస్తోంది.

కొన్ని కార్పొరేష‌న్ల‌లో అధికార పార్టీ తెరాస గెలుపు అంత సులువు కాద‌నే అభిప్రాయం స‌ర్వేలో వ్య‌క్త‌మైన‌ట్టు స‌మాచారం. క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, నిజామాబాద్, రామ‌గుండం… ఈ ప్రాంతాల్లో తెరాస కంటే ప్ర‌తిప‌క్షాలు కాస్త బ‌లం పుంజుకున్నాయ‌ని తేలింద‌ట‌. కార‌ణాలు ఏంటంటే… తెలంగాణ ఏర్ప‌డ్డ త‌రువాత రాష్ట్రంలోని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో అనూహ్య‌మైన అభివృద్ధి అంటూ ఏదీ క‌నిపించ‌క‌పోవ‌డం, మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌లో కొంత వెన‌క‌బాటు, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జ‌ర‌గ‌క‌పోవ‌డం, రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక అర్బ‌న్ ప్రాంత నాయ‌కులు స్థానిక స‌మ‌స్య‌ల‌పై కొంత అల‌స‌త్వ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం… ఇలాంటి కొన్ని కార‌ణాలు తెరాస వెన‌క‌బాటుకు కారణాలుగా స‌ర్వేలో తేలిన‌ట్టుగా పార్టీ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఈసారి మైనారిటీ ఓట్లు మొత్తంగా ప‌డితే త‌ప్ప‌, చాలా చోట్ల తెరాస‌కు కాస్త పోరాటం త‌ప్ప‌ద‌నే అభిప్రాయం స‌ర్వేలో వ్య‌క్త‌మైంద‌ని అంటున్నారు. చాలా మున్సిపాటిటీల్లో కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి పోటీని ఇవ్వ‌బోతోంద‌నీ, భాజపా కూడా కొన్ని చోట్ల బ‌లంగానే క‌నిపిస్తోంద‌ని తేలింద‌ట‌.

మొత్తానికి, మున్సిప‌ల్ ఎన్నిక‌లు కేసీఆర్ సాబ్ కి కొంత టెన్ష‌న్ పెంచుతున్న‌ట్టుగానే ఉన్నాయి. అందుకే, మున్సిప‌ల్స్ లో పార్టీ గెలుపు బాధ్య‌త‌ల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్ప‌టికే అప్ప‌గించారు. అంతేకాదు, వారివారి స్థానాల్లో పార్టీ విజ‌యం సాధించ‌క‌పోతే… స్థానిక నేత‌లే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌నీ చెప్పేశారు! తాజాగా అంత‌ర్గ‌త స‌ర్వే నేప‌థ్యంలో తెరాస నేత‌ల‌కు రాబోయే ఎన్నిక‌లు మ‌రింత వేడి పెంచేవిగానే క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com