ఆనంద్‌ ఆశ‌లు ఆవిరి

ప్ర‌తిభ‌ – విజ‌యం ప‌క్క ప‌క్క‌న ఉంటాయ‌నుకుంటే పొర‌పాటు. తెలుగు చిత్ర‌సీమ ఇందుకు అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌తిభావంతులైన చాలా ద‌ర్శ‌కులు విజ‌యాలు లేక మ‌రుగున ప‌డిపోయి ఉన్నారు. వాళ్ల‌లో టాలెంట్ ఎంత ఉన్నా స‌రే, హిట్టు లేక‌పోతే దానికి గుర్తింపు ఉండ‌దు. అలా ప్ర‌తిభ‌ని న‌మ్ముకున్న ద‌ర్శ‌కుల‌లో వీఐ ఆనంద్ ఒక‌డు. ఒక్క క్ష‌ణం, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు. డిస్కోరాజాలోనూ ఆయ‌నో ప్ర‌యోగం చేద్దామ‌నుకున్నారు. కానీ విక‌టించింది.

డిస్కోరాజా సినిమా హిట్ట‌యితే దానికి సీక్వెల్ వెంట‌నే ప‌ట్టాలెక్కేసేది. అందుకు త‌గిన వేదిక కూడా డిస్కోరాజా స్క్రిప్టులోనే సిద్ధం చేసుకున్నాడు ఆనంద్. ర‌వితేజ కూడా ఈ సినిమాపై ముందు నుంచీ ఎందుకో గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉండేవాడు. అన్నీ కుదిరితే ఈ వేస‌విలోనే డిస్కోరాజా 2 వ‌చ్చేది. కానీ.. డిస్కోరాజా రిజ‌ల్ట్ తో దానికి ద్వారాలు మూసుకుపోయాయి. గీతా ఆర్ట్స్ లో ఆనంద్ ఓ సినిమా చేయాలి. బ‌న్నీతో ఓ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని అనుకున్నాడు. ఓ క‌థ కూడా చెప్పాడు. డిస్కోరాజా హిట్ట‌యితే ముందు బ‌న్నీ నుంచే పిలుపు వ‌స్తుంద‌ని ఆశించాడు. అవి కూడా ఆవిరైపోయాయిప్పుడు. ఈ ఫ్లాపు రెండు ప్రాజెక్టుల‌కు గుదిబండ గా మారింది. ఆనంద్ మ‌ళ్లీ రేసులోకి రావాలంటే మ‌ళ్లీ ఏ చిన్న హీరోనో, చిన్న క‌థ‌నో న‌మ్ముకుని మ‌రో ప్ర‌యోగం చేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com