ఫిరాయింపుల కోసమే మండలి రద్దు ప్రచారం..!?

శాసనమండలిని నిజంగా రద్దు చేసే ఆలోచన ఉందా..? అలా చేసే దానికి ఎమ్మెల్సీలను ఆకర్షించడం దేనికి..? ఇవి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వస్తున్న సందేహాలు. మూడు రాజధానుల బిల్లును ఆమోదించకపోతే.. మండలిని రద్దు చేస్తామని.. మండలి సమావేశం అయిన మొదటి రోజే వైసీపీ వర్గాలు బెదిరింపులకు దిగాయి. దీనికి కారణం.. రద్దు భయంతోనో.. తాయిలాల ఆశతోనే.. సభ్యులంతా.. తమ వైపు వస్తారని ఆశించడమే. కానీ అనుకున్నట్లుగా జరగలేదు. చివరికి బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఎవరూ తమ వైపు రాకపోవడంతో.. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ మార్చారు. మండలి రద్దు చేయబోతున్నట్లుగా అసెంబ్లీలోనే సభ్యులతో మాట్లాడించారు. అందరితోనూ మద్దతు పలికించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం చేసిన వారి..ఆయన మండలిని రద్దు చేస్తున్నట్లుగా తీర్మానం చేస్తారేమో అనుకున్నారు కానీ.. సోమవారం చర్చిద్దామని చెప్పారు.

నిజానికి శాసనమండలి సభ్యులైన ఇద్దరు మంత్రులు కూడా.. మండలిని రద్దు చేయమనే చెప్పారు. అందరూ అభిప్రాయాలు చెప్పిన తర్వాత కొత్తగా చర్చించాల్సిందేమిటో చాలా మందికి అర్థం కాలేదు. విపక్ష సభ్యుల వాదనను పరిగణనలోకి తీసుకునే పరిస్థితి వైసీపీకి లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి మండలిని రద్దు చేయాలనుకోవడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని బిల్లులను ఆమోదించుకోవడమే లక్ష్యంగా ఆయన.. ఈ ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభ్యులంతా.. వైసీపీకి అనుకూలంగా మారితే.. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని.. ఆ తర్వాత కొత్తగా మళ్లీ బిల్లులు పెట్టించి.. ఆమోదించుకోవాలనే పద్దతిలో జగన్ వ్యూహం పన్నారంటున్నారు.

అందుకే మూడు రోజుల సమయం తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ వ్యూహకర్తలు ఇతర పార్టీ ఎమ్మెల్సీలతో.. సంప్రదింపులు ప్రారంభించారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు సహా విపక్ష నేతలు ఇదే చెబుతున్నారు. మండలి రద్దు చేస్తే నష్టపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఎన్నికలసమయంలో జగన్మోహన్ రెడ్డి టిక్కెట్లు ఇవ్వలేకపోయిన నేతలు.. ఇతర పార్టీల ఆశావహుల్ని పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుని.. వారందరికీ ఎమ్మెల్సీ ఆఫర్లు ఇచ్చారు. ఇలా ఇచ్చిన వారు దాదాపుగా రెండు వందల మంది ఉంటారు. వీరంతా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక.. టీడీపీ ఎమ్మెల్సీలు మెజార్టీ ఉన్నప్పటికి…మరో ఏడాదిన్నరలో.. వీరిలో ఎక్కువ మంది పదవీ కాలం ముగిసిపోతుంది. ఆ తర్వాత .. మండలిలో వైసీపీకే మెజార్టీ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మండలి రద్దు నిర్ణయం తీసుకోరని… కేవలం బెదిరింపులకు దిగి.. ఎమ్మెల్సీల్ని ఆకర్షించడానికే ..అసెంబ్లీలో.. అలాంటి ప్రకటనలు చేశారని అంటున్నారు. ఏం జరుగుతుందో సోమవారం తేలిపోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com