జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. వెంటనే భర్తీ చేయాలన్న నిబంధన ఉండటంతో ఉపరాష్ట్రపతి రాజీనామా అధికారికంగా ఆమోదం పొందిన వెంటనే సన్నాహాలు ప్రారంభించింది. ఓటర్ల జాబితాను రెడీచేసింది. లోక్ సభ, రాజ్యసభల్లో సభ్యులంతా ఓటు హక్కు కలిగి ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అయితే ఎమ్మెల్యేలు కూడా ఓటర్లుగా కూడా ఉంటారు.కానీ ఉపరాష్ట్రపతి పదవికి మాత్రం పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఓటర్లు.
ఉపరాష్ట్రపతి పదవి ఎవరిని వరిస్తుందన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ అనూహ్యమైనా వ్యక్తులను రంగంలోకి దించే ట్రాక్ రికార్డు మోడీ ,షాలకు ఉంది. అందుకే ఎవరి పేర్లు ప్రచారంలోకి వచ్చినా అదంతా గాసిప్సే అవుతాయి. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం లేదని.. బీజేపీ నుంచి మాత్రమే ఉపరాష్ట్రపతి ఉంటారని చెబుతున్నారు.
నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 21వ తేదీ కాబట్టి.. చివరి వరకూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. నామినేషన్ల గడువుకు రెండు రోజుల ముందు పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. పోటీకి అభ్యర్థిని పెట్టాలని ఇండియా కూటమి భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఓటింగ్ ఖాయం. ఓటింగ్ జరగాల్సి వస్తే సెప్టెంబర్ 9న నిర్వహిస్తారు. కౌంటింగ్ కూడా అదే రోజు జరుగుతుంది.