బీజేపీ వచ్చే ముందు సీబీఐ, ఐటీ, ఈడీ వస్తాయని కొంత మంది సెటైర్లు వేస్తూ ఉంటారు. తమిళనాడులో ఈడీ, ఐటీ చాలా కాలంగా ఉన్నాయి. తాజాగా సీబీఐ రంగంలోకి దిగింది. మిగతా రెండు డీఎంకే నేతల సంగతి చూసుకుంటే..సీబీఐ మాత్రం విజయ్ ను గురిపెట్టింది. కానీ అది రాజకీయ సమీకరణాల ఆధారంగానే ఉండనుంది.
తొక్కిసలాట ఘటనపై త్వరలో విజయ్‌కు సీబీఐ నోటీసులు
తమిళనాట రాజకీయ అరంగేట్రం చేసిన దళపతి విజయ్‌కు ఆదిలోనే భారీ సవాలు ఎదురవుతోంది. కరూర్ జిల్లాలో సెప్టెంబర్ 2025లో జరిగిన ‘టీవీకే’ బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట సంఘటనపై సీబీఐ తన విచారణను వేగవంతం చేసింది. ఈ దుర్ఘటనలో సుమారు 41 మంది మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలను విచారించిన సీబీఐ, త్వరలోనే స్వయంగా విజయ్ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందన్న వార్తలు తమిళనాట రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
పోరాడి సీబీఐకి ఇప్పించుకున్న విజయ్
గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్ జిల్లాలో విజయ్ నిర్వహించిన భారీ రాజకీయ ర్యాలీలో ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభిమానులు తరలివచ్చారు. కేవలం 10 వేల మందికి అనుమతి తీసుకున్న సభకు దాదాపు 25 వేల మందికి పైగా రావడం, సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఈ భారీ తొక్కిసలాట జరిగిందని పోలీసుల ప్రాథమిక నివేదిక పేర్కొంది. అయితే, ఇది తమ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక అధికార పక్షం చేసిన కుట్ర అని టీవీకే ఆరోపించింది. సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని సుప్రీంకోర్టు స్వయంగా సీబీఐకి అప్పగించింది.
టీవీకే సీనియర్ నేత విచారణ పూర్తి
ఈ కేసులో భాగంగా తాజాగా టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్ , కరూర్ జిల్లా కార్యదర్శులను సీబీఐ ఢిల్లీలో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించింది. సభ నిర్వహణలో వైఫల్యాలు, సీసీటీవీ ఫుటేజ్ , వాలంటీర్ల బాధ్యతపై అధికారులు ఆరా తీశారు. అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం, సభకు విజయ్ రావడంలో జరిగిన జాప్యం వల్ల అభిమానులు అసహనానికి లోనై ముందుకు రావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు.
బీజేపీపై దూకుడు తగ్గించిన విజయ్
విచారణ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, ఈవెంట్ ఆర్గనైజర్‌గా, పార్టీ అధ్యక్షుడిగా విజయ్ బాధ్యతను కూడా సీబీఐ పరిశీలిస్తోంది. పార్టీ నేతల వాంగ్మూలాల ఆధారంగా విజయ్‌కు కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే విజయ్ రాజకీయ వ్యూహాన్ని బట్టి సీబీఐ చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న విజయ్ ముందు ముందు బీజేపీ గండాన్ని దాటాల్సి ఉంది.
