తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టిన నటుడు విజయ్, తన రాజకీయ వ్యూహాలను చాలా వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇటీవల తిరుప్పరంకుండ్రం వంటి సున్నితమైన అంశాలపై ఆయన మౌనం వహించడం, అదే సమయంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ తిరుప్పరంకుండ్రం వివాదం. ఈ వివాదంపై విజయ్ స్పందించకపోవడం చర్చకు దారితీసింది. హిందూ మనోభావాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాలపై ఆయన మౌనం వహించడం వెనుక, మెజారిటీ ఓటు బ్యాంకును నొప్పించకూడదనే ఉద్దేశం ఉందని ఆయన పార్టీ వర్గాలంటున్నాయి. అయితే ఆయన హిందువులకు మద్దతుగా మాట్లాడకపోవడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనిని అస్త్రంగా చేసుకున్న విపక్షాలు, విజయ్ కేవలం ఒక వర్గం ఓటు బ్యాంకును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శిస్తున్నాయి.
మరోవైపు, చెన్నై శివారులోని మహాబలిపురంలో విజయ్ నేతృత్వం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిన్నపిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వారికి బహుమతులు పంపిణీ చేస్తూ ఆయన ఉత్సాహంగా గడిపారు. తిరుప్పరంకుండ్రం విషయంలో మౌనంగా ఉండి, క్రైస్తవ పండుగలను మాత్రం బహిరంగంగా సెలబ్రేట్ చేయడం ఆయన రాజకీయ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోణంలో విజయ్ వ్యూహాత్మకంగా ఉంటున్నారని అంటున్నారు. తమిళనాడులో ద్రావిడ రాజకీయాలు ఎప్పుడూ లౌకికవాదం చుట్టూ తిరుగుతుంటాయి. విజయ్ తన పార్టీ భావజాలం సెక్యులరిజం అని ఇప్పటికే ప్రకటించారు. అయితే, బీజేపీని సిద్ధాంతపరమైన శత్రువుగా, డీఎంకేను రాజకీయ శత్రువుగా ప్రకటించిన విజయ్, మైనారిటీ ఓట్లపై పట్టు సాధించేందుకే ఇలాంటి వ్యూహాలను అనుసరిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
విజయ్ అసలు పేరుతో జోసెఫ్ విజయ్. ఆయన తాను క్రైస్తవుడ్నని ఒప్పుకుంటారు. ఆయన కోసం ఇప్పుడు చర్చిల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనను సీఎం చేయడానికి క్రైస్తవులంతా ఓట్లు వేయాలని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని.. దీపం వివాదంలో హిందువులకు మద్దతుగా మాట్లాడకపోవడంపై తమిళనాడులో చర్చ జరుగుతోంది. ఇది రాజకీయంగా ఓటు బ్యాంకును సృష్టిస్తుంది కానీ.. ప్రధాన వర్గాన్ని దూరం చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
