తెలుగు సినిమాల్లో నటించే ఆర్టిస్టులు అందరూ అచ్చ తెలుగులో మాట్లాడతారని చెప్పలేం. చాలామంది భాష రాకున్నా డబ్బింగ్తో మేనేజ్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండకు మాత్రం డబ్బింగ్తో మేనేజ్ చేయడం ఇష్టం లేదు. అందుకని స్పెషల్గా ఒక ట్యూటర్ని పెట్టుకుని కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తెలుగు, తమిళ బైలింగ్వల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం ప్రత్యేకంగా తమిళ్ నేర్చుకుంటున్నాడీ యంగ్ హీరో. అందుకోసం స్పెషల్గా తమిళ్ క్లాసులు, ట్యూషన్ చెప్పించుకుంటున్నాడు. డైరెక్టర్ అంత అవసరం లేదని చెప్పినా విజయ్ ఊరుకోలేదు. సినిమాలో, సన్నివేశాల్లో నటించేటప్పుడు భాష తెలిస్తే భావం బాగా వస్తుందని తమిళ్ కోసం కుస్తీలు పడుతున్నాడు. దాంతో డైరెక్టర్ పిచ్చ హ్యాపీ. హీరో డెడికేషన్ నాకు నచ్చిందని ఆనంద్ శంకర్ పేర్కొన్నాడు. సినిమా కోసం విజయ్ ఈ విధంగా కష్టపడడం కొత్త కాదు. సాధారణంగా విజయ్ మాటల్లో తెలంగాణ యాస ఎక్కువ వినిపిస్తుంది. తెలుగులో చేస్తున్న ఓ సినిమా కోసం గోదావరి యాస నేర్చుకున్నాడు.