అవును.. ల‌వ్ స్టోరీలు మానేయ‌డ‌మే బెట‌ర్‌

“ఇదే నా ఆఖ‌రి ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌” అని విజ‌య్‌దేవ‌ర‌కొండ స్టేట్‌మెంట్ ఇచ్చిన‌ప్పుడు, అది ప‌బ్లిసిటీ కోస‌మో, సినిమాపై న‌మ్మ‌కంలేకో, అనుభ‌వం స‌రిపోకో వ‌చ్చిన మాట అనుకున్నారంతా. ప్రేమ‌క‌థ‌లు చేయాల్సిన వ‌య‌సులో, దానికి దూరం అవ్వ‌డ‌మేంటి? అని ఫ్యాన్స్ కూడా బాధ ప‌డ్డారు.

కాక‌పోతే ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’ చూశాక‌.. విజ‌య్ తీసుకున్న నిర్ణ‌యం స‌బ‌బే ఏమో అనిపిస్తోంది. ఎందుకంటే ప్రేమ‌క‌థంటే, అందునా ఫ‌స్ట్రేష‌న్‌లో ఉన్న ల‌వర్ అంటే.. ‘అర్జున్‌రెడ్డి’ `పూనేస్తున్నాడాయ‌న‌కు. విజ‌య్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ద‌ర్శ‌కులు కూడా అర్జున్‌రెడ్డిని ఊహించుకునే క‌థ‌లు చెప్ప‌డం, అర్జున్ రెడ్డి గెట‌ప్‌తో స‌హా దించేయాల‌ని చూడ‌డం చూస్తుంటే ‘అర్జున్ రెడ్డి’ హ్యాంగోవ‌ర్ ఇంకా పోలేద‌ని అర్థం అవుతోంది. అలాగ‌ని ప్రేమికుడిని సాఫ్ట్‌గా చూపిస్తే – గీత గోవిందం, పెళ్లిచూపులు నాటి విజ‌య్ గుర్తొచ్చేస్తున్నాడు. ఇది నిజంగా… విజ‌య్ కెరీర్‌కు, త‌న ప్రేమ‌క‌థ‌ల‌కూ శాప‌మే.

ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ మొద‌లుకుని, త‌న‌కు క‌థ‌లు చెప్పే ద‌ర్శ‌కులంతా అర్జున్‌రెడ్డి హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట‌కు రావాలి. ప్రేమ క‌థ అంటే అటు అర్జున్ రెడ్డి – ఇటు గీత గోవిందం రెండూ కావు. దాన్ని మించిన క‌థ‌లెన్నో పుడుతుంటాయి. అవెక్క‌డున్నాయో విజయ్ తెలుసుకోవాలి.

“నేను గెడ్డం పెంచితే చాలు. అర్జున్ రెడ్డితో పోలుస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌న్‌, యాక్ డ్రామా, థ్రిల్ల‌ర్‌…. ఇలా ఏం చేసినా, అర్జున్ రెడ్డి అంటున్నారు”అనేది విజ‌య్ కంప్లైంట్‌. కావొచ్చు. కానీ గెడ్డం పెంచడం ఒక్క‌టే కాదు. తెర‌పై త‌న న‌ట‌న‌, ఆ పాత్ర స్వ‌భావం, అది చూపించే యాటిట్యూడ్ అంతా అర్జున్‌రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ‘వర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’లో అది ఇంకాస్త స్ప‌ష్టంగా క‌నిపించింది. యామిని దూరమైంద‌న్న బాధ‌లో సైకోలా ప్ర‌వ‌ర్తించ‌డం, రోడ్డుపై ప‌రుగులు పెట్ట‌డం, అర‌వడం.. ఇన‌వ్నీ ‘అర్జున్ రెడ్డి’ని చూసిన ఫీలింగే క‌లిగిస్తున్నాయి.అలాంటప్పుడు ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు పోలిక‌లు ఎత్తి చూపిస్తే అది వాళ్ల త‌ప్పుకానే కాదు.

ప్రేమ‌క‌థ‌లు మానేయ‌డం క‌రెక్టు కాదేమో గానీ, కొంత‌కాలం మాత్రం వాటికి దూరంగా ఉండ‌డమే బెట‌ర్ అనిపిస్తోంది. పైగా త‌న చేతిలోనూ ఇప్పుడు ప్రేమ‌క‌థ‌లు లేవు. పూరితో చేస్తున్న సినిమా ల‌వ్ స్టోరీ కాదు. త‌మిళంలో చేస్తున్న `హీరో` స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో న‌డిచే క‌థ‌. సో… రెండు మూడేళ్ల వ‌ర‌కూ విజ‌య్ ల‌వ్ స్టోరీల్లో క‌నిపించ‌డు. ఈలోగా ఈ హ్యాంగోవ‌ర్ త‌గ్గితే, అప్పుడు విజ‌య్ కోసం కొత్త క‌థ‌లు పుడ‌తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com