సినీ తారలకు ఇమేజే పెట్టుబడి. వారి ఇమేజ్‌కి భంగం కలిగే విషయాలు జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పొరపాటున తమ పేరు మిస్లీడ్ అయినా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు విజయ్ దేవరకొండకి కూడా ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. ఈడీ విచారణకు హాజరయ్యారు విజయ్. అనుమతులు లేని కొన్ని యాప్స్‌ని ఆయన ప్రచారం చేశారనేది సబ్జెక్ట్. అయితే ఈ సోషల్ మీడియా కాలంలో నిజానిజాలు, అసలు సబ్జెక్ట్, అన్ని విషయాలు సంగ్రహించి వార్త రాసే ఓపిక చాలా కొరవడింది.
అయన విచారణకు హాజరైన వెంటనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రచారం చేసిన కేసులో విచారణకు హాజరైన విజయ్ అనే టైటిల్స్‌తో కుప్పలుతెప్పలుగా వార్తలు, వీడియోలు పుట్టుకొచ్చాయి. మరికొందరైతే విజయ్ అరెస్ట్ తప్పదా? అనే టైటిల్స్‌తో కూడా వార్తలు ఇచ్చి తమ సంచలన శైలితో మురిసిపోయారు. ఎవరైనా ఒక సెలబ్రిటీ పేరు వార్తల్లోకి వచ్చినప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ తీరు ఇంత వింతగా ఉంటుంది.
విజయ్ బాధ కూడా ఇదే. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ముందుగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. “దయచేసి నేను బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశాననే హెడ్డింగ్స్ ఆపేయండి” అని మీడియాని కోరాడు విజయ్.
“బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్.. రెండు రకాలు ఉన్నాయి. నేను A23 అనే గేమింగ్ యాప్‌ని ప్రమోట్ చేశా. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌కి సంబంధం లేదు. గేమింగ్ యాప్స్‌కి జీఎస్టీ, టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయి. నేను లీగల్ గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశా. కంపెనీతో నేను చేసుకున్న ఒప్పందం వివరాలూ ఈడీ వారికి ఇచ్చాను” అని బల్లగుద్ది చెప్పాడు విజయ్.
విజయ్ మాటలు గమనిస్తే… ఈడీ విచారణకు హాజరుకావడం కంటే మీడియాలో తన పేరు మిస్లీడ్ అయ్యిందన్న ఆవేదనే ఎక్కువగా కనిపించింది. ఏదేమైనా సినీ తారలు ఇకపై ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే అవసరాన్ని ఈ ఉదంతం తెలియజేస్తోంది.