గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానిని భాజపా అధిష్టానం ఈరోజు ఎంపిక చేసింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ప్రభుత్వంలో రవాణా, నీటి సరఫరా, కార్మిక మరియు ఉపాధి శాఖలకి మంత్రిగా పనిచేశారు. ఆయనే రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కూడా. ముఖ్యమంత్రి రేసులో ఉన్న నితిన్ పటేల్ కి చాలా నిరాశ కలిగింది. భాజపా అధిష్టానం ఆయనని ఉపముఖ్యమంత్రిగా నియమించింది. ఆయన కూడా ఆనందీ బెన్ ప్రభుత్వంలో మంత్రిగా చేసేవారు. ఆయనకే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించినప్పటికీ, ఆఖరి నిమిషంలో విజయ్ రూపానికి ఆ అవకాశం దక్కింది.
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కారి అహ్మదాబాద్ వెళ్లి భాజపా ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి ఎక్కడా అసమ్మతి తలెత్తకుండా ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియని పూర్తి చేశారు. విశేషం ఏమిటంటే విజయ్ రూపాని 2014లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఆయనకి ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్.ఎస్.ఎస్.ఆశీర్వాదం ఉండటం బాగా కలిసి వచ్చింది. పార్టీలో, ప్రభుత్వంలో ముఠాలు కట్టే అలవాటు లేకపోవడం, సమస్యలని పరిష్కరించడంలో మంచి నేర్పు, అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ అధిష్టానం పట్ల పూర్తి విధేయత కలిగి ఉండటం వంటివన్నీ ఆయనకి ఈ అవకాశం కల్పించాయి. ఆయన చాలా క్లిష్టమైన పరిస్థితులలో కీలక బాధ్యతలు స్వీకరించబోతున్నారనే చెప్పవచ్చు. పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం, దళితుల అసంతృప్తి, వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికలలో మళ్ళీ భాజపాని గెలిపించడం వంటి అగ్నిపరీక్షలు ఆయన ఎదుర్కోవలసి ఉంటుంది. విజయ్ రూపాని, నితిన్ పటేల్ ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తారు.