జగన్ రెడ్డి ఎన్ని పాదాయత్రలు చేసినా ప్రయోజనం ఉండదని కూటమిని విడగొడితేనే గెలుస్తారని లేకపోతే అవకాశం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. లిక్కర్ స్కాంలో ఈడీ ఎదుట హాజరైన ఆయన ఈడీ విచారణతో పాటు తాను చేయాలనుకునన్న రాజకీయ వ్యాఖ్యలన్నీ చేశారు. అలాగే రాజకీయాల్లోకి వస్తున్నానని కూడా చెప్పుకున్నారు. ఈడీ విచారణ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూస్తే… ఎంతో టెన్షన్ లో ఉన్నారని సులువుగా అర్థమైపోతుంది.
లిక్కర్ స్కాం గురించి తనకేమీ తెలియదంటారు..మళ్లీ అంతా రాజ్ కేసిరెడ్డే చేశారంటారు. తాను మిథున్ రెడ్డి అడిగారని అరబిందో నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డికి వంద కోట్లు ఇప్పించానంటారు. అయినా అరబిందో తన కంపెనీ కాదంటారు. జగన్ కు లిక్కర్ స్కాం గురించి తెలియదంటారు. తనను అప్రూవర్ గా మార్చే శక్తి ఎవరికీ లేదంటారు.ఇలా పరస్పర వైరుధ్యమైన మాటలతో ఆయన ప్రెస్మీట్లో కంగారు కంగారుగా కనిపించారు.
జగన్మోహన్ రెడ్డి మళ్లీ తనను దగ్గరకు తీయాలని ఆయన ఆరాటపడుతున్నారు.కోటరీ ఉన్నంత కాలం అది సాధ్యం కాదని కోటరీని పందికొక్కులతో పోల్చారు. వారే తనపై జగన్ కు వెన్నుపోటు పొడుస్తారని చెప్పి దూరం చేశారని అన్నారు. కూటమిని విడగొట్టాలంటే కోటరీ వల్ల కాదని..తన వల్లే అవుతుందన్నట్లుగా చెప్పుకొచ్చారు. జగన్ కు పాలేరులా పని చేశానని అయినా తనను దూరం పెట్టారని బాధపడ్డారు. తాను జగన్ ను విమర్శించలేదని కానీ జగనే తనను విమర్శించారని..ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పుకొచ్చారు. కేసుల దగ్గరకు వచ్చే సరికి తనను నెంబర్ టు చేస్తారని కానీ లాభాల విషయంలో మాత్రం వందో స్థానంలో కూడా ఉండన్నారు.
ఇక రాజకీయాల్లోకి కూడా వస్తున్నానని చెప్పుకొచ్చారు. ఏడాది కిందట రాజకీయాల నుంచి విరమించుకున్నానని ఈ నెల ఇరవై ఐదు తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానన్నారు. మొత్తంగా జగన్ మోహన్ రెడ్డి తనను పిలుస్తారని కోటరీని దూరం పెడతారని విజయసాయిరెడ్డి ఆశపడుతున్నారు. అది జరుగుతుందో లేదో కానీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణలో దొరికిపోయారని ఆయన ప్రెస్మీట్ లో తడబడిన వైనం చూస్తే అందరికీ క్లారిటీ వస్తోంది.