ఏ ప్రయత్నం చేసినా విజయం సాధించాలంటే విజయదశమి నుంచి ప్రారంభించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే విజయదశమి రోజున ప్రారంభిస్తేనే విజయం దరి చేరదు. గెలిచేదాకా ప్రయత్నించడమే అసలు విజయదశమి. విజయం కోసం ప్రయాణం చేసే ఉత్సవం దసరా అనుకోవచ్చు.
” యోగేశ్వరుడు , ధనుర్ధారి ఎక్కడ ఉంటారో క్కడే విజయం ఉంటుంది.” అని భగవద్గీతలో చివరి శ్లోకం చెబుతుంది. ఇక్కడ యోగేశ్వరుడు అంటే దైవ సంకల్పం… ధనుర్ధారి అంటే మానవ కృషి… అంటే దైవసంకల్పానికి మానవ కృషి తోడైతే ఎంతటి విజయం అయినా సాధించవచ్చు. మానవ కృషికి భగవంతుని అనుగ్రహంతోడైతే విజయం లభిస్తుంది.
పండుగ ఎందుకు చేసుకుంటామో మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే అవి కథ రూపంలో ఉంటాయి .కానీ అవి ఇప్పటి పరిస్థితుల్ని అన్వయించుకునేలానే ఉంటాయి. విజయదశమిగా చేసుకునే దసరాలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు , మార్చుకోవాల్సిన అంశాలూ చాలా ఉంటాయి. ఆది పరాశక్తి మహిషాసురుడిని సంహరించింది. ఇక్కడ నిజంగా రాక్షసుడు ఎవరో కాదు. దుర్గుణాలే రాక్షసులు. ప్రతి మనిషిలోనూ రాక్షసులు ఉంటారు. మనలోని దుర్గుణాలే రాక్షసులు. మనలోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి మనలో ఉండే దుర్గుణాలను తొలగించుకోవాలి. మనలోని చెడును మనం అంతమొందించుకుంటే అంత కంటే పెద్ద దసరా ఉండదు.
దసరా లేదా విజయ దశమి గురించి తెలుసుకున్నా.. అర్థం చేసుకున్నా.. మన జీవితానికో పాఠం అవుతుంది. మన గురించి మనం తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. మనం చెడు మార్గంలో వెళ్తూంటే హెచ్చరిస్తుంది. ఆ చెడును అంతం చేసుకుంటే విజయం వైపు వెళ్తావని గుర్తు చేస్తుంది. ఆ లక్ష్యాన్ని నిర్దేశించడానికే పండుగ.
హ్యాపీ విజయదశమి !