లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ కుంభకోణంలో భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. గత వారమే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ నాయకులు, అధికారులను ప్రశ్నించిన ఈడీ, తాజాగా విజయసాయిరెడ్డి నుంచి కీలక సమాచారాన్ని సేకరించే పనిలో పడింది.
2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన మద్యం విధానంలో సుమారు రూ.3,500 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్లను కాదని కేవలం నగదు రూపంలోనే మద్యం విక్రయాలు జరపడం, కొత్త బ్రాండ్లను ప్రోత్సహిస్తూ సిండికేట్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ఈడీ దృష్టి సారించింది. ఈ విధానం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఆ నిధులు ఎక్కడకు మళ్లాయి అనే కోణంలో విజయసాయిరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. ఈ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు మద్యం విక్రయాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించారని, అలాగే ఎన్నికల ఖర్చులకు వినియోగించారనేది ప్రధాన అభియోగం. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే మిథున్ రెడ్డి వంటి ఇతర నేతలకు కూడా నోటీసులు అందాయి. ఆయన శుక్రవారం విచారణకు హాజరు కానున్నారు.
