మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. అప్పుడప్పుడూ బయటకు వచ్చి అవసరం అయితే రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నారు. ఎవరికి అవసరం అయితే అన్నది మాత్రం ఆయన చెప్పడం లేదు. ఆయనకు అవసరమా..?. జగన్‌కు అవసరమా? లేకపోతే తాను అత్యంత గౌరవంగా చూసుకున్నానని చెప్పుకుంటున్న జనసేనాధినేతకు అవసరం వచ్చినప్పుడా అన్నది ఆయన చెప్పడం లేదు. ఆయన లిక్కర్ స్కాంలో చాలా వివరాలు చెప్పారని ఆయన కోవర్ట్ అని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. కానీ జగన్ ఆడిస్తున్న గేమ్ లో భాగంగానే ఆయన బయటకు వచ్చారని టీడీపీ క్యాడర్ అనుమానిస్తున్నారు. మొత్తానికి ఆయన కోవర్టే కానీ.. ఎవరికి కోవర్జిజం చేస్తున్నారన్నది మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. అదే ఆయన క్యారెక్టర్ అనుకోవచ్చు.
లిక్కర్ కేసు, కూటమి నేతలకు పొగడ్తలు జగన్ కోవర్ట్
విజయసాయిరెడ్డి తనకు ఇప్పుడు ఎవరితోనూ విబేధాలు లేవంటున్నారు. చంద్రబాబు, పవన్ తో వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలూ లేవని రాజకీయంగా మాత్రమే గతంలో విమర్శలు చేశానని కవర్ చేసుకుంటున్నారు. గతంలో పవన్ కల్యాణ్‌ను అత్యంత ఘోరంగా విమర్శించారు.కానీ తాను అసలు ఏమీ అనలేదని.. ముందు ముందు కూడా అనే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన లిక్కర్ స్కాంలో చాలా వివరాలు సిట్ కు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇచ్చారో లేదో తెలియదు కానీ ఏ 5గా ఉన్న ఆయన చాలా ధీమాగా బయట తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నారంటే ఖచ్చితంగా విచారణకు ఎంతో కొంత సహకరిస్తున్నారన్నమాట. అంటే రెండు వైపులా..ఆయన కూటమి పెద్దలను మంచి చేసుకునే ప్రయత్నం చేశారు.
జగన్ కోసం అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న ఏజెంట్
వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఊహించని తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతున్న జగన్ ను రక్షించడానికి విజయసాయిరెడ్డి మొత్తం అండర్ కవర్ ఆపరేషన్ చేసేందుకు బయటకు వచ్చారన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఆయన జగన్ కు దూరమైనట్లుగా నటిస్తున్నారు కానీ.. అది ఎలా సాధ్యమన్న ప్రశ్నలు సహజంగా అందరిక వస్తాయి. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మొత్తం విజయసాయిరెడ్డి గుప్పిట్లో ఉంది. అలాంటి వ్యక్తిని జగన్ రెడ్డి వదులుకోవడం అసాధ్యం. కానీ వదులుకున్నారు. ఆయన బయటకు వచ్చి జగన్ ను ఏమీ అనడం లేదు. ఆయన చుట్టుపక్కల ఎవరో ఉన్నారు.. అని వారిని టార్గెట్ చేస్తున్నారు. జగన్ రెడ్డికి అవన్నీ తెలియకుండా ఉంటాయా? అని అనుమానిస్తున్నారు.
మొత్తంగా విజయసాయిరెడ్డి ఎవరూ నమ్మని వ్యక్తి
విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎవరూ నమ్మని వ్యక్తి. ఆయనను జగన్ నమ్ముతారో లేదో తెలియదు. ఇప్పటికి అయితే నమ్మడం లేదు. బహిరంగంగా నమ్మడం లేదు. అంతర్గతంగా నమ్ముతారోలేదో ఆయనకే తెలియాలి. కూటమి నేతలు ఆయనను ఏ విధంగా నమ్మరు. కుదిరితే ఆయన వద్ద ఉన్న రహస్యాలను ఉపయోగించుకుని జగన్ ను దెబ్బకొట్టే వరకూ ఉపయోగించుకుంటారు. కానీ దగ్గరకు తీసుకునే అవకాశం లేదు. ఆయనను బీజేపీ కూడా దగ్గరకు రానివ్వదు. ఎందుకంటే ఆయనను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మొత్తంగా విజయసాయిరెడ్డి కోవర్టు.. ఎవరికి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారో ఆయనకే తెలుసు. అందుకే ఎవరూ దగ్గరకు రానివ్వడం లేదు.
