కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో తల్లి పాత్రను పోషించారు విజయశాంతి. నిన్న విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయితే కొందరు పనికట్టుకుని నెగిటివ్ ప్రచారం చేసేలా కనిపించారు. ఈ ట్రెండ్ ని గమనించిన విజయశాంతి ఈరోజు జరిగిన సక్సెస్ మీట్ లో సినిమాపై దుష్ప్రచారం చేయదలుచుకున్న కొందరిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘సినిమా గ్రాఫ్ పెరుగుతుంది. కానీ కొందరు సినిమాని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది వాళ్ళ శాడిజం. నిర్మాత కోట్లు పెట్టి సినిమా తీస్తాడు. డైరెక్టర్లు హీరోలు హీరోయిన్లు మిగతా అందరూ డే అండ్ నైట్ కష్టపడతారు. ఇలాంటి నెగిటివ్ ప్రచారం వల్ల వాళ్లందరికీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. వాంటెడ్ గా చేస్తున్నారు. నేను చూస్తున్నాను వింటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు’అని హెచ్చరించారు.
ఏ హీరో సినిమా అయినా ఇలాంటి నెగటివ్ ప్రచారం మంచిది కాదు. ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తున్నారో మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఇండస్ట్రీ ని బతకనివ్వండి. ఎన్నో హోప్స్ పెట్టుకొని ఈ ఇండస్ట్రీలోకి వస్తారు. వాళ్ళని ఆశీర్వదించండి. మీకు నచ్చకపోతే చూడకండి. అంతేగాని సినిమాని ఖూనీ చేద్దామని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను దయచేసి ఆపండి. థియేటర్స్ లో ప్రజలు చూసి అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ప్రేక్షకులు ఎంత పాజిటివ్ గా చెప్తున్నప్పుడు కొందరు మాత్రం శాడిజం చూపించి నెగటివ్ ప్రచారం చేస్తున్నారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి. ఎవరైనా మిమ్మల్ని గెలుకుతూ మిమ్మల్ని ఎవరైనా మైండ్ వాష్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి చెంచా కొట్టుకోండి. అంతేగాని సినిమాని నాశనం చేసేలా రాయకండి. ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని జీవితాలు పోతాయి. సినిమానే నాశనం చేసేద్దాం అనుకునే వాళ్ళని జీవితంలో క్షమించకూడదు. దయచేసి కొంచెం కంట్రోల్ గా ఉండండి. దయచేసి ఇలాంటి పనులను మానుకోండి. సినిమా ఇండస్ట్రీకి బతికించండి’ అంటూ తనదైన శైలి వార్నింగ్ ఇచ్చారు విజయశాంతి.
విజయశాంతి మాటల్లో అర్ధం వుంది. ఒకప్పుడు సినిమాని రివ్యూ చేసే విధానానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేశాయి. సినిమాపై సంపూర్ణమైన అవగాహన వున్న వారే రివ్యూ చేసి లోటుపాట్లని చెప్పేవారు. ఎక్కడ దిద్దుకొవచ్చో సూచించేవారు. కానీ ఇప్పుడు రివ్యూలలో పర్శనల్ ఎటాకింగ్ కనిపిస్తుంది. సబ్జెక్ట్ పై రాయకుండా చెప్పకుండా బిజినెస్ లు ఓపెనింగులు ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవన్నీ రివ్యూల్లోకి వచ్చేశాయి. కొందరైతె పనిగట్టుకొని సినిమాపై దాడి చేస్తుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగింది. ఇవన్నీ గమనించిన విజయశాంతి 40 ఏళ్ల అనుభవం కలిగిన నటిగా కాస్త ఘాటుగానే స్పందించారు. మరి ఆమె మాటలతోనైన ఈ శాడిజంలో ఎలాంటి పరివర్తన వస్తుందో చూడాలి.