విజయవాడ, తిరుపతి గ్రేటర్లుగా మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జనగణన నోటిఫికేషన్ , దానికి సంబంధించిన నిబంధనల కారణంగా ఇప్పుడు సరిహద్దులు మార్చే అవకాశం లేదు. అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ ఫ్రీజ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనగణన ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు, దేశవ్యాప్తంగా జిల్లాల, మండలాల, మున్సిపాలిటీల సరిహద్దులను ఫ్రీజ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అంటే, జనగణన పూర్తయ్యే వరకు ఏ ప్రాంత సరిహద్దులను మార్చడానికి లేదా కొత్త ప్రాంతాలను విలీనం చేయడానికి వీలుండదు.
గ్రేటర్ నగరాలుగా మార్చాలంటే చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేసి, వార్డుల పునర్విభజన చేపట్టాలి. ప్రస్తుతం సెన్సస్ నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాదు. కేంద్రం నిబంధనలు: డిసెంబర్ 31, 2025 లోపు ఏవైనా సరిహద్దు మార్పులు ఉంటే పూర్తి చేయాలని, ఆ తర్వాత 2027 వరకు అంటే జనగణన ముగిసే వరకు ఎటువంటి మార్పులు చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. విజయవాడ, తిరుపతి వంటి నగరాల విస్తరణకు అవసరమైన కసరత్తు మరియు రాజకీయ ఏకాభిప్రాయం ఈ స్వల్ప వ్యవధిలో సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం ప్రస్తుతానికి వీటిని పక్కన పెట్టింది.
జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేయవద్దని కేంద్రం నుండి ఆదేశాలు ఉన్నాయి. అందుకే గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలను ప్రస్తుతానికి విరమించుకుంటున్నాము. జనగణన ప్రక్రియ ముగిసిన వెంటనే వీటిని మళ్లీ పరిశీలిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. విజయవాడ నగరం వేగంగా విస్తరించకపోవడానికి గ్రేటర్ గా మార్చకపోవడమే కారణం అన్న అభిప్రాయం ఉంది. గతంలో చాలా ప్రభుత్వాలు ప్రతిపాదనలకే పరిమితం చేశాయి. టీడీపీ ప్రభుత్వం వీటిపై కసరత్తు చేస్తోంది. జనగణన పూర్తి కాగానే..తిరుపతి, విజయవాడను గ్రేటర్లుగా మార్చి..సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ఉంది.
