విజయవాడ శివారు ప్రాంతాలైన కానూరు, పోరంకి ప్రాంతాలు భవిష్యత్తులో కోకాపేట స్థాయికి ఎదుగుతాయన్న అంచనాలు రియల్ ఎస్టేట్ వర్గాలు వేస్తున్నాయి. కానూరు, పోరంకి, తాడిగడప వంటి ప్రాంతాలు ఇప్పుడు ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్‌గా మారాయి. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరగడం, ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
త్వరలోనే ఇక్కడ భారీ ఆకాశహర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు వెలుస్తాయన్న అంచనాలతో రియల్ ఎస్టేట్ రంగం కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. ఇలాంటి అంచనాలు రావడానికి ప్రధాన కారణం ఇక్కడి అద్భుతమైన కనెక్టివిటీ. అమరావతి రాజధాని నగరానికి నేరుగా అనుసంధానించేలా నిర్మిస్తున్న వెస్ట్ బైపాస్ రోడ్డు కీలకంగా మారింది. దీనివల్ల విజయవాడ నగరంతో సంబంధం లేకుండా నేరుగా రాజధాని ప్రాంతానికి, అటు గుంటూరుకు చేరుకునే సౌలభ్యం కలగనుంది.
కాస్త ఆలస్యం అయినా మరో రెండేళ్లలో గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన కూడా కార్యరూపం దాలుస్తుండటంతో, భవిష్యత్తులో ఇక్కడ అత్యున్నత స్థాయి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని భాిస్తున్నారు. ఈ అంచనాల ఫలితంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతాల్లో ల్యాండ్ డీల్స్ సంఖ్య పెరిగింది. ప్రధాన రోడ్లకు సమీపంలో ఉన్న స్థలాల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్ల నిర్మాణం ఊపందుకుంది. బహుళ జాతీయ సంస్థలు తమ కార్యాలయాల కోసం ఇక్కడ స్థలాలను అన్వేషిస్తుండటంతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున భూములను సమీకరిస్తున్నారు.
