మాస్ట‌ర్‌ రివ్యూ : ‌ ఓన్లీ ఫ‌ర్ విజ‌య్ ఫ్యాన్స్‌

కొన్ని సినిమాలు హీరోల కోసం చూడాలి.
ఇంకొన్ని డైరెక్ట‌ర్ల కోసం చూడాలి.
ఓ వైపు విజ‌య్‌.. ఇంకోవైపు.. లోకేష్ క‌న‌గ‌రాజ్‌.. విజ‌య్ సేతుపతి మాట స‌రే స‌రి. ఖైదీ చూశాక‌…లోకేష్ క‌న‌గ‌రాజ్ పై విప‌రీత‌మైన న‌మ్మ‌కం, ప్రేమ క‌లిగేశాయి. ఖైదీతో ఓ కొత్త త‌ర‌హా సినిమాని ప్రేక్ష‌కుడికి ప‌రిచ‌యం చేశాడు లోకేష్‌. రొటీన్ క‌థ‌ల్ని ఎంచుకున్నా వ‌ర్క‌వుట్ అయిపోయే ఇమేజ్ ఉన్న విజ‌య్ తో… లోకేష్ ఏదో అద్భుతం చేస్తాడ‌ని క‌ల‌లు క‌న్నారు అభిమానులు. మ‌రి… వాళ్ల ఆశ‌లు ఏమ‌య్యాయి? ఈ మాస్ట‌ర్ `మాస్ట‌ర్ పీస్‌`గా నిలిచిందా..?

క‌థ‌లోకి వెళ్తాం.. జేడీ (విజ‌య్) ఓ లెక్చ‌‌రర్‌. త‌న పంథానే వేరు. స్టూడెంట్స్ లో స్టూడెంట్ గా క‌లిసిపోగ‌ల‌డు. అందుకే… కాలేజీలో త‌న‌దే హ‌వా. జేడీ వెనుక ఓ స్టూడెంట్స్ గ్యాంగ్ ఉంటుంది. కాలేజీలో త‌న హీరోయిజం.. యాజ‌మాన్యానికి బొత్తిగా రుచించ‌దు. త‌న‌ని స‌స్పెండ్ చేసినా, స్టూడెంట్స్ ప్రాబ‌ల్యంతో మ‌ళ్లీ… జాయిన్ అవుతాడు. యాజ‌మాన్యం వ‌ద్ద‌న్నా… కాలేజీ ఎల‌క్ష‌న్ల బాధ్య‌త‌న తాను తీసుకుంటాడు. అయితే ఎల‌క్ష‌న్ల‌లో జ‌రిగిన ర‌చ్చ వ‌ల్ల‌… కాలేజీ వ‌దిలేయాల్సివ‌స్తుంది. మూడు నెల‌ల‌కోసం.. వ‌రంగ‌ల్ లోని అజ్వ‌ర్వేష‌న్ హోంకి మాస్ట‌ర్ గా వెళ్తాడు.

అక్క‌డ 18 ఏళ్ల‌లోపు బాల‌ నేర‌స్థులుంటారు. వాళ్ల‌ని.. భ‌వానీ (విజ‌య్ సేతుప‌తి) త‌న అవ‌స‌రాల కోసం వాడుకుంటుంటాడు. బ‌య‌ట తాను హ‌త్య‌లు చేసి, ఆ కేసుల్లో బాల నేర‌స్థుల్ని స‌రెండ‌ర్ చేయించి,ఇంకా ఇంకా ఆ హోమ్ లోనే మ‌గ్గేలా చేస్తుంటాడు. భ‌వానీ అకృత్యాల‌కు మాస్ట‌ర్ ఎలా క‌ళ్లెం వేశాడు? ఆ హోంలోని పిల్ల‌ల్ని ఎలా త‌న దారిలోకి తెచ్చుకున్నాడు..? అనేదే `మాస్ట‌ర్` క‌థ‌.

స‌రైన ఆయుధం దొరికిన‌ప్పుడే వేట మ‌జాగా ఉంటుంది. స‌రైన హీరో దొరికిన‌ప్పుడు.. ద‌ర్శ‌కుడి ప‌ని సుల‌భం అవుతుంది. లోకేష్‌కి ఇప్పుడు విజ‌య్ దొరికాడు. విజ‌య్ బాడీ లాంగ్వేజ్ కీ, త‌న మేన‌రిజానికి సూటైపోయే క్యారెక్ట‌ర్ రాసుకున్నాడు లోకేష్‌. దాన్ని తెర‌పై ఆవిష్క‌రించేట‌ప్పుడూ ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌లేదు. లోకేష్ పూర్తిగా ఓ మాస్ డైరెక్ట‌ర్ అయిపోయి.. తీసిన సినిమా ఇది.

భ‌వానీ పాత్ర‌ని ఇంట్ర‌డ్యూస్ చేస్తూ క‌థ మొద‌లెట్టాడు. ఆ పాత్ర విజ‌య్ సేతుప‌తిది… అని ప్రేక్ష‌కుడికి తెలిసేలోగా.. `ఇది హీరో క్యారెక్ట‌రా` అన్నంత రేంజ్ లో సాగుతుంటాయి ఆ సీన్ల‌న్నీ. ఈ క‌థ‌లో ఉన్న‌వి రెండు బ‌ల‌మైన పాత్ర‌లు. ఒక‌టి.. జేడీ, రెండోది భ‌వానీ. ఈ రెండు పాత్ర‌ల్నీ స‌మ‌ర్థ‌వంతంగానే రాసుకున్నాడు. కాక‌పోతే.. విజ‌య్ సేతుప‌తిలా హీరో స్థాయి ఉన్న ఓ న‌టుడ్ని విల‌న్ గా చూపించ‌డంలోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయ‌న్న విష‌యం భ‌వానీ పాత్ర‌ని చూస్తున్న‌ప్పుడు క‌లుగుతుంటుంది. సేతుప‌తి పాత్ర‌ని హీరో రేంజ్‌లోనే చూపిస్తుంటాడు. ఆ బిల్డ‌ప్పులూ, ఆ ఎలివేష‌న్ షాట్లూ అలానే ఉంటాయి. ఆ పాత్ర‌ని ఎక్క‌డ డీ గ్రేడ్ చేస్తే… విజ‌య్ సేతుప‌తి ఫ్యాన్స్ హ‌ర్ట‌యిపోతారో… అన్న భ‌యంతో… దాన్ని ఎలివేట్ చేసుకుంటూనే వెళ్లాడు.

విల‌న్ నే ఎక్కువ ఎలివేట్ చేస్తే హీరో ఏం అనుకుంటాడో… అన్న భ‌యంతోనో ఏమో.. ద్వితీయార్థంలో
చాలా సేప‌టి వ‌ర‌కూ భ‌వానీ పాత్ర క‌నిపించ‌దు. అస‌లు హీరో – విల‌న్లు ఎదురు ప‌డేది క్లైమాక్స్ లోనే. విజ‌య్ – విజ‌య్ సేతుప‌తిల భీక‌ర‌మైన పోరు చూడ్డానికి వెళ్లిన ప్రేక్ష‌కుల‌కు.. ఈ దాగుడు మూత‌లాట‌, ఫోన్లో.. వార్నింగుల గోల న‌చ్చ‌క‌పోవొచ్చు. పైగా.. మూడు గంట‌ల సినిమా ఇది. ప్ర‌తీ స‌న్నివేశాన్నీ లాగ్ చేసుకుంటూనే వెళ్లాడు. స్లో మోష‌న్లు, ఎలివేష‌న్లూ మ‌రీ ఎక్కువగా క‌నిపిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు.. విజ‌య్‌ని స్టూడెంట్స్ కాలేజీకి తీసుకొచ్చే సీనే… దాదాపు 10 నిమిషాలు ఉంటుంది. అందులో 5 నిమిషాలు కేవ‌లం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ తో స్టెప్పులేసే పాట‌. ఇంత లాగ్ త‌మిళ‌నాట విజ‌య్ ఫ్యాన్స్ కి న‌చ్చొచ్చు. మ‌న‌వాళ్ల‌కు.. క‌ష్ట‌మే.

కొన్ని చోట్ల డిఫరెంట్ గా ఆలోచిద్దామ‌న్న ఆలోచ‌న‌తో ద‌ర్శ‌కుడు దొరికిపోయాడు. ఉదాహ‌ర‌ణ‌కు.. హీరోయిన్‌ని (అస‌లు త‌ను హీరోయిన్నేనా అనేది పెద్ద అనుమానం) రౌడీలు త‌రుముతుంటారు. త‌ను.. ఎక్క‌డో ఉన్న హీరోకి ఫోన్ చేస్తుంది. ఫోన్లో.. హీరోయిన్ కి సూచ‌న‌లు ఇస్తుంటాడు విజ‌య్‌. ఇక్క‌డ‌.. ఏదో మ్యాజిక్ జ‌రుగుతుంది. హీరో త‌న తెలివితేట‌ల్ని ఉప‌యోగించి, రౌడీల ఆట క‌ట్టిస్తాడు అనుకుంటారు. అలాంటిదేం జ‌ర‌గ‌దు. ఓ బుడ్డాగాడు వ‌చ్చి స‌మ‌స్య‌ని సాల్వ్ చేసి వెళ్తాడు. దాంతో ఆ సీన్ తుస్సుమ‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది.

హీరో బ‌కెట్ ప‌ట్టుకుని భ‌వానీ గ్యాంగ్ ని కొట్టుకుంటూ వెళ్తుంటాడు. అదే సీన్ లో మ‌రో వైపు….త‌న మ‌నుషుల్ని త‌న్ని త‌రిమేస్తుంటాడు. ఇదంతా ఏమిటో అర్థం కాదు.

క్లైమాక్స్ లో కూడా అంతే.. పిల్ల‌ల్ని కంటేన‌ర్ లో ఎక్కించుకుని లారీ వెళ్తుంటుంది. ఆ లారీని ఆప‌డానికి హీరో వెళ్లాలి. అంత ముఖ్య‌మైన ప‌ని ప‌క్క‌న పెట్టేసి, మాస్ట‌ర్ ఓ రౌడీ గ్యాంగ్ కి క్లాస్ తీసుకుంటాడు. కేవ‌లం మాట‌ల‌తో వాళ్ల‌లో మార్పు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. అదంతా కేవ‌లం సాగ‌దీత వ్య‌వ‌హారంలా అనిపిస్తుంది. హీరో.. అబ్బ‌ర్వేష‌న్ హోంలో ఉంటే… అదేదో పిక్నిక్ స్పాట్ అన్న‌ట్టు.. హీరోయిన్ వ‌చ్చీ పోతూ ఉంటుంది. అస‌లు ఈ సినిమాలో హీరోయిన్ ఉంది, ఆ పాత్ర‌ని కూడా ప‌ట్టించుకోవాలి.. అనే ధ్యాస‌లో ద‌ర్శ‌కుడు లేడు. భ‌వానీ, జేడీ పాత్ర‌ల్ని త‌ప్ప లోకేష్ మ‌రో పాత్ర‌ని ప‌ట్టించుకోలేదు.

ఇంట్ర‌వెల్ బ్యాంగ్ లో `ఓయ్ మాస్టారు.. ఇది వ‌ర‌కు నువ్వు చాలా సార్లు విన్న‌దే.. ఇప్పుడు నేను చెబుతున్నా.. ఐయామ్‌ వెయిటింగ్` అంటాడు విజ‌య్‌సేతుప‌తి. నిజంగా.. విజ‌య్ ఫ్యాన్స్ కి ఈ డైలాగ్ బాగా న‌చ్చేస్తుంది. కాక‌పోతే.. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత హీరో – విల‌న్ల భీక‌ర‌మైన పోరు ఉంటుంది అని ప్రేక్ష‌కుడూ వెయిట్ చేస్తాడు. అక్క‌డ లోకేష్ త‌న తెలివితేట‌ల్ని చూపించాల్సింది. కానీ.. తాను కూడా ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ లా మారిపోయి, రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఫార్ములా ప్ర‌కార‌మే సీన్లు అల్లుకుంటూ పోయాడు.

విజ‌య్ చాలా చ‌లాకీగా జేడీ పాత్ర‌ని చేసుకుంటూ పోయాడు. త‌న ఫ్యాన్స్ కి కావ‌ల్సిన స‌రంజామా అంతా ఇందులో ఉంటుంది. ఫ్యాంటు.. జారిపోతుంటే స‌ర్దుకోవ‌డం.. లాంటి చిన్న చిన్న ట‌చింగులు న‌చ్చుతాయి. కొన్ని సీన్ల‌లో చాలా నీర‌సంగా, ఉదాశీనంగా క‌నిపిస్తుంటాడు విజ‌య్‌. ఇదంతా ద‌ర్శ‌కుడు స్టైల్ అనుకోవాలి. ఇక విజ‌య్ సేతుప‌తి త‌న ధోర‌ణిలోనే చాలా స‌హ‌జంగా ఈ పాత్ర‌ని చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. త‌న ఎలివేష‌న్లు బాగున్నాయి. `డ‌బ్బు కోసం ప‌నిచేయ‌డానికీ, డ‌బ్బు తీసుకుని ప‌నిచేయ‌డానికీ` తేడా చెబుతూ ఓ సీన్ ఉంది ఈ సినిమాలో. అక్క‌డ‌.. విజ‌య్ లో హీరోని చూస్తారు త‌న ఫ్యాన్స్‌. విల‌నిజం కూడా.. ఎంత సింపుల్ గా చేయొచ్చో.. చూపించాడు.

అనిరుథ్ కి మాస్ హీరోలంటే చాలా ఇష్టం. వాళ్ల ఎలివేష‌న్ సీన్లు అన‌గానే.. రెచ్చిపోయి కొట్టేస్తుంటాడు. అనిరుథ్ ఇచ్చిన ఆర్‌.ఆర్‌… విజ‌య్ ఫ్యాన్స్ కి బాగా న‌చ్చేస్తుంది. `చిట్టి స్టోరీ..` పాట హ‌మ్ చేసుకోవ‌డానికీ బాగుంది. ఫొటోగ్ర‌ఫీ, ఆర్ట్ వ‌ర్క్‌.. ప‌ర్‌ఫెక్ట్‌గా ప‌నిచేశాయి. సినిమా లుక్ వేరేలా ఉంటుంది. స్టార్ హీరోల‌తో సినిమా చేసిన‌ప్పుడు ప్ర‌యోగాలు చేయ‌కూడ‌దు, ఫార్ములాకి క‌ట్టుబ‌డ‌డంలో త‌ప్పులేదు… అని లోకేష్ భావించి ఉంటాడు. అందుకే.. కొత్త‌గా ఏదో చూపించే అవ‌కాశం.. త‌న పాయింట్ లో ఉన్నా, ఆ జోలికి వెళ్ల‌లేదు. దాంతో విజ‌య్ అభిమానుల‌కు ఈ సినిమా న‌చ్చేసినా, లోకేష్ నుంచి కొత్త‌ద‌నం ఆశించే వాళ్లు మాత్రం నిరాశ ప‌డ‌తారు.

రేటింగ్: 2.5 / 5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close