సినిమా రంగుల ప్రపంచం నుంచి రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టే ఏ నాయకుడైనా, తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల ముందు ఎంత పారదర్శకంగా ఉంచుతారనే దానిపైనే వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. విజయ్ విషయంలో ఇప్పుడు నైతికత అనే అంశం ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఒక సామాన్య నటుడు కేవలం తన కళతో ప్రేక్షకులను అలరిస్తే సరిపోతుంది కానీ, ప్రజా తీర్పు కోరే నాయకుడు సమాజ నైతిక విలువల్ని కనీసం పాటిస్తున్నట్లుగా కనిపించాల్సి ఉంటుంది.
త్రిషతో బంధం బహిర్గతం చేసిన విజయ్
విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తరుణంలో, కుటుంబ వివాదాలు ఇంకా కోర్టు పరిధిలో ఉండగానే మరో వ్యక్తితో బహిరంగంగా వేడుకలకు హాజరుకావడం రాజకీయంగా ప్రతికూల సంకేతాలను పంపే అవకాశం ఉంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సినిమా తారలను దైవ సమానులుగా చూస్తారు, అలాగే వారి కుటుంబ విలువలకు కూడా ప్రజలు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. పాతికేళ్ల వైవాహిక బంధాన్ని వదులుకునే ప్రక్రియ పూర్తి కాకముందే, తన సహచర నటితో కలిసి బహిరంగ ప్రదేశాల్లో కనిపించడం వల్ల ప్రత్యర్థి పార్టీలకు విమర్శనాస్త్రం అందించినట్లవుతుంది.
రాజకీయాల్లోకి వచ్చాక ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు!
రాజకీయాల్లోకి వచ్చేముందు తన వ్యక్తిగత జీవితంలోని సమస్యలన్నింటినీ క్లీన్ చేసుకుని వచ్చి ఉంటే విజయ్‌కు ప్రజాదరణ మరింత పెరిగేది. వివాదాలు కొనసాగుతున్న సమయంలో నైతికత అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఇంతకు హీరో జయం రవి కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. తన భార్యతో విడాకుల వివాదం ఉండగానే తన ప్రియురాలితో కలిసి పెళ్లిళ్లకు హాజరయ్యారు. అయితే జయం రవి వంటి నటులు కేవలం బాక్సాఫీస్ వద్ద ఫలితాల కోసం ఎదురుచూస్తారు కాబట్టి వారి వ్యక్తిగత విషయాలు సినిమా కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ, ఓటు వేసేటప్పుడు సామాన్య ప్రజానీకం నాయకుడి వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల మనోభావాలను ఇటువంటి ఘటనలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.
కుటుంబ సమస్యలపైనే ఇలా వ్యవహరిస్తే – రేపు పాలనలోనూ ఇలాగే ఉంటారా?
తమ బంధాన్ని బహిర్గతం చేయడం ద్వారా తాము నిజాయితీగా ఉన్నామని విజయ్ భావించి ఉండవచ్చు, కానీ రాజకీయ వ్యూహకర్తల కోణంలో చూస్తే ఇది ఒక నెగటివ్ ఇమేజ్ ను సృష్టించే ప్రమాదం ఉంది. ప్రజా నాయకుడు ఎప్పుడూ ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకునే సమాజంలో, విడాకుల వ్యవహారం తేలకముందే ఇలాంటి అడుగులు వేయడం ఆయన రాజకీయ ప్రస్థానానికి ఒక అడ్డంకిగా మారవచ్చు. నైతిక విలువలకు, రాజకీయ పరిణతికి మధ్య ఉన్న సన్నని గీతను విజయ్ ఎలా దాటుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రేపు ఆయనకు ఓటు వేసి అధికారం ఇస్తే.. ఇలా తెగించినట్లుగా పాలన చేస్తే ఎలా అన్న ప్రశ్న ఓటర్లకు వస్తుంది.
