తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి షెడ్యూల్ వెలువడే సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టమైన చిత్రాన్ని టీవీకే అధినేత విజయ్ ఆవిష్కరించారు. సేలం వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో విజయ్ చేసిన ఒంటరి పోరు ప్రకటన ద్రావిడ రాజకీయాల్లో ప్రస్తుతానికి ఓ స్పష్టతనిచ్చింది. ఎటువంటి ముందస్తు లేదా అనంతర పొత్తులు ఉండబోవని, తమ లక్ష్యం కేవలం సింగిల్ మెజారిటీ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయడం ద్వారా త్రిముఖ రాజకీయ పోరాటం ఉంటుందని తేల్చేశారు.
రిస్క్ చేసినా.. మార్పుపైనే విజయ్ గురి
రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన విజయ్, క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను తెలుసుకునే ఈ భారీ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సర్వేలు పార్టీకి పూర్తి మెజారిటీని అంచనా వేయకపోయినా, ఆయన మాత్రం ఓటర్ల అంతర్గత నాడిపై నమ్మకంతో ఉన్నారు. ప డీఎంకే, అన్నడీఎంకేల పాలనతో విసిగిపోయిన తమిళ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని, ఆ శూన్యాన్ని తన విజిల్ గుర్తుతో భర్తీ చేయవచ్చని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. విజయ్ తన వ్యూహంలో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ఒక నమూనాగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. సంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్, అకాలీదళ్‌లను కాదని ప్రజలు ఎలాగైతే ఏకపక్షంగా ఆప్‌ను గెలిపించారో, తమిళనాడులోనూ అదే స్థాయిలో సైలెంట్ వేవ్ వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.
కింగ్ కాలేకపోతే కింగ్ మేకర్
కూటమిలో చేరాలని అటు కాంగ్రెస్ , ఇటు ఎన్డీఏ నుంచి పరోక్షంగా ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, విజయ్ తన సిద్ధాంతానికే మొగ్గు చూపారు. డీఎంకేను రాజకీయ శత్రువుగా, బీజేపీని సిద్ధాంతపరమైన శత్రువుగా ప్రకటించిన తర్వాత, వారితో పొత్తు పెట్టుకుంటే పార్టీ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆయన భావించారు. పొత్తుల రాజకీయాల వల్ల సీట్ల పంపకంలో వచ్చే తలనొప్పుల కంటే, అన్ని 234 స్థానాల్లో తన సొంత బలాన్ని పరీక్షించుకోవడమే సరైన మార్గమని ఆయన నిర్ణయించుకున్నారు. ఒక వేళ ఎన్నికల ఫలితాల్లో కింగ్ కాలేకపోయినా ఖచ్చితంగా కింగ్ మేకర్‌ను అవుతానని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
త్రిముఖ పోటీతో మారిపోనున్న సమీకరణాలు
విజయ్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల తమిళ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. త్రిముఖ పోటీ ఖాయమవుతోంది. డీఎంకే, అన్నాడీఎంకేల ఓటు బ్యాంక్ బలంగా ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, యువత, తటస్థ ఓటర్లు భారీగా టీవీకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో, విజయ్ గెలుచుకునే ప్రతి స్థానము అత్యంత కీలకం కానుంది. అందుకే అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చినా ఆయన ఒంటరి పోటీకే మొగ్గు చూపుతున్నారు.