టీవీకే అధినేత విజయ్‌కు ఆయన భార్య మరో షాకిచ్చారు. విజయ్ తనను ఇంట్లోకి రానివ్వడం లేదని తమ విడాకుల కేసు విచారణలో ఉన్నంత కాలం, చెన్నై ఈసీఆర్ రోడ్డులోని నీలాంకరై నివాసంలో తాను ఉండేందుకు అనుమతించాలని భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఇంటిపై తనకు సమాన హక్కు ఉందని, విజయ్ హోదాకు తగినట్టుగా తనకు మరో ప్రత్యామ్నాయ నివాసం లేదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ తాను విడాకుల ప్రక్రియను కొనసాగిస్తే తనను ఆ ఇంటి నుంచి పంపించే అవకాశం ఉందని విజయ్ తరపు న్యాయవాదులు సూచించడంతో ఆమె ఈ రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
విజయ్ వార్షిక ఆదాయం , సామాజిక హోదాను దృష్టిలో ఉంచుకుని, తనకు, తన పిల్లలకు తగినంత శాశ్వత భరణం చెల్లించాలని సంగీత డిమాండ్ చేశారు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, విజయ్ దాదాపు 250 కోట్ల భరణం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. 2021 నుండి విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధంలో ఉన్నారని, అది తనను మానసిక క్షోభకు గురిచేసిందని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు.
విజయ్ ప్రస్తుతం సినిమాలకు స్వస్తి చెప్పి, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఈ కీలక సమయంలో ఆయన కుటుంబ సమస్యలు , కోర్టు నోటీసులు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ కేసులో వ్యక్తిగత గౌరవానికి భంగం కలగకుండా ఉండాలని, విచారణను రహస్యంగా చేపట్టాలని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని సంగీత కోర్టును కోరారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20 న జరగనుంది.


