విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న జాతీయ రహదారి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగానికి గోల్డెన్ కారిడార్ గా మారింది. ముఖ్యంగా కాజ, పెదకాకాని ప్రాంతాలు రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉండటంతో, ఇక్కడ భారీ నివాస ప్రాజెక్టుల నిర్మాణానికి డెవలపర్లు క్యూ కడుతున్నారు. ఈ ప్రాంతాల్లోని భూములకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో కేవలం వ్యవసాయ భూములుగా, చిన్న చిన్న వెంచర్లుగా ఉన్న కాజ, పెదకాకాని ప్రాంతాల్లో ఇప్పుడు బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, భారీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు ప్రాణం పోసుకుంటున్నాయి. అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం కావడం, ఐటీ హబ్ ,విద్యా సంస్థలకు ఈ ప్రాంతం చేరువలో ఉండటం డెవలపర్లను ఇటువైపు ఆకర్షిస్తోంది. ప్రస్తుతం కాజ,పెదకాకాని పరిసరాల్లో సుమారు 20కి పైగా కొత్త ప్రాజెక్టులు అనుమతుల కోసం ఏపీ-రెరా ,సీఆర్డీఏకు దరఖాస్తు చేసుకున్నాయి.
ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ హబ్‌గా మారడానికి ప్రధాన కారణం దీని భౌగోళిక స్థానం. విజయవాడ బెంచ్ మార్క్ నుండి కేవలం 15 నిమిషాల ప్రయాణ దూరంలో, గుంటూరు నగరానికి అతి సమీపంలో ఉండటం ఇన్వెస్టర్లకు కలిసి వచ్చే అంశం. హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్ల విస్తరణ ఇన్నర్ రింగ్ రోడ్డు అనుసంధానత పెరగడంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక మినీ సిటీగా రూపుదిద్దుకోనుంది. గత ఆరు నెలల్లోనే ఈ ప్రాంతంలో చదరపు గజం ధర సుమారు 30 నుండి 40 శాతం వరకు పెరిగింది. ప్రస్తుతం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న వెంచర్లలో గజం ధర రూ. 35,000 నుండి రూ. 60,000 వరకు పలుకుతోంది. అయితే, ఇక్కడ పెట్టుబడి పెట్టే వారు అక్రమ లేఅవుట్ల ఉచ్చులో పడకుండా, తప్పనిసరిగా రేరా రిజిస్ట్రేషన్ నంబర్ , సీఆర్డీఏ ఆమోదం ఉన్న ప్రాజెక్టులను మాత్రమే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
