జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ. ఈ వ్యవస్థను ఎందుకు తెచ్చారన్న సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి సరికొత్త సవాలుగా మారింది. సుమారు ప్రతి 2,000 మంది జనాభాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, వేలాది మంది ఉద్యోగులను నియమించిన ఈ వ్యవస్థ నిర్వహణ ప్రస్తుతం భారంగా మారుతోంది. వాళ్లకు పని ఉండదు.. ఉన్న పని చేయరు. ఎవరు కార్యాలయాలకు వస్తారో ఎవరు రారో కూడా తెలియడం లేదు.
వాట్సాప్ గవర్నెన్స్‌తోనే అన్నీ సేవలు
ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా 160కి పైగా సేవలు ప్రజల మొబైల్‌కే అందుతుండటంతో, క్షేత్రస్థాయిలో సచివాలయాల అవసరం కనిపించడం లేదు. ఏ గ్రామం, వార్డు కార్యాలయానికి వెళ్లినా ఖాళీగా కనిపిస్తోంది. సేవలు అందించేవారు ఉండటం లేదు.. తీసుకునే వారు ఉండటం లేదు. కానీ ఉద్యోగులకు పెద్ద ఎత్తున జీతాలు మాత్రం చెల్లించాల్సి వస్తోంది. గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటర్లను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను సృష్టించింది. వేల కోట్ల రూపాయల వేతనాలు చెల్లిస్తున్నా, సేవలు ఆన్లైన్ కావడంతో ఈ ఉద్యోగులకు సరైన పని లేని పరిస్థితి ఏర్పడింది. ఈ భారీ యంత్రాంగాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక, వారిని తొలగించలేక ప్రభుత్వం సతమతమవుతోంది. ఫలితంగా, ప్రస్తుతం ఈ వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తూ సచివాలయాల పేర్లను స్వర్ణ వార్డు/స్వర్ణ గ్రామంగా మారుస్తూ ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది.
ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరుకు నిర్ణయం
సచివాలయ ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, కార్యాలయాలు వెలవెలబోతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఉద్యోగుల పనితీరును గాడిలో పెట్టేందుకు జనవరి 2026 నుంచి ముఖ ఆధారిత హాజరు విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఉదయం నిర్ణీత సమయానికి హాజరు నమోదు చేయకుంటే ఆ రోజు వేతనంలో కోత విధిస్తామని ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. బయోమెట్రిక్ విధానంలో ఉన్న లోపాలను అరికట్టి, ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయంలో ఉండేలా చూడాలని నిర్ణయించుకుంది.
సంస్కరణల దిశగా అడుగులు
కేవలం పేర్లు మార్చడమే కాకుండా, సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో, పెన్షన్ల పంపిణీ , ఇతర ప్రభుత్వ పథకాల క్షేత్రస్థాయి సర్వే బాధ్యతలను వీరికి అప్పగిస్తోంది. సాంకేతికత పెరిగిన కాలంలో ఈ భౌతిక కార్యాలయాల నిర్వహణ అవసరమా అన్న చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతానికి హాజరును కఠినతరం చేయడం ద్వారా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. పని చేయకుండా ఉండటానికి అలవాటు పడిన వారికి ఇది సమస్యగా ఉండవచ్చు కానీ ప్రభుత్వం మాత్రం వ్యవస్థను ప్రజలకు ఉపయోగపడేలా మార్చాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
