హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అమరావతిలో జరుగుతోందని ప్రజానాట్యమండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సంస్థల నాయకురాలు విమలక్క ఆరోపించారు. బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడంకోసం మూడు పంటలు పండే పొలాలను నాశనం చేస్తున్నారని, అక్రమంగా బాక్సైట్ తవ్వకాలను చేస్తున్నారని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా గళాలు విప్పిన వారిని అక్రమ కేసులు బనాయించి నిర్బంధిస్తున్నారని, అందులో భాగంగానే ప్రజా కళాకారుడు కోటిని గుంటూరులో మఫ్టీలో ఉన్న పోలీసులు గత శనివారం అరెస్ట్ చేశారని అన్నారు. గుంటూరులో ప్రజా నాట్యమండలి జిల్లా కమిటీ సమావేశానికి హాజరై తిరిగి వస్తున్న కోటిని 2005లో ఐపీఎస్ అధికారి మహేష్ లడ్డాపై హత్యాయత్నం చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ చేశారని, అసలు ఆ కేసు ఎప్పుడో వీగిపోయిందని చెప్పారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతోనూ, ప్రైవేట్ కంపెనీలతోనూ ఇప్పటివరకు చేసుకున్న ఒప్పందాలన్నింటినీ తక్షణమే బయటపెట్టి చర్చించాలని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్, ఇతర అధికారులు చంద్రబాబుకు వ్యాపార భాగస్వాములేనని తాము చెప్పినవన్నీ ఇప్పుడు నిజాలవుతున్నాయని చెప్పారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై సింగపూర్ ప్రభుత్వం తరపున మంత్రి ఈశ్వరన్ సమక్షంలో సంతకాలు చేసిన టో యెంగ్ అనే అధికారి ఇప్పుడు అక్కడ తన పదవికి రాజీనామా చేశాడని అన్నారు. మాస్టర్ ప్లాన్ తయారుచేసిన రెండు సింగపూర్ కంపెనీలూ విలీనమై ఏర్పడిన కంపెనీకి టో యెంగ్ సీఈఓగా నియమితులయ్యారని చెప్పారు. ఉన్నతస్థానంలో ఉన్న ఒక ప్రభుత్వాధికారి సంతకాలు చేశాక ఆ పదవినుంచి తప్పుకుని అదే సింగపూర్‌లోని ప్రైవేట్ సంస్థకు సీఈఓగా వస్తున్నారంటే ఇందులో ఎంత మాయాజాలం ఉందో అర్థం చేసుకోవాలని బొత్స అన్నారు.