రివ్యూ: విన‌య విధేయ రామ‌

తెలుగు360 రేటింగ్‌: 2.25/5

ఒక‌డు ప‌ది మందిని కొడితే కిక్కు లేదిప్పుడు..
యాభై మందిని న‌రికినా ఆన‌డం లేదిప్పుడు…
వంద మందిని చంపినా స‌రిపోవ‌డం లేదిప్పుడు…
గుట్ట‌లు గుట్ట‌లుగా శ‌వాలు క‌నిపించాల్సిందే. అదే హీరోయిజం అని న‌మ్ముతున్న కాలంలో ఉన్నాం.
హీరోయిజం ఇలా చూపించ‌డం త‌ప్పు కాదు.

వంద‌ల మందిని అడ్డంగా న‌రికేయ‌డం నేరం కాదు. కానీ అంత‌టి ఎమోష‌న్ క‌థ‌లో ఉండాలి. `వీళ్లంద‌రినీ మా హీరో చంపేయాల్సిందే` అన్నంత కోపం థియేట‌ర్లో ప్రేక్ష‌కుడికి రావాలి. రాజ‌మౌళి స‌క్సెస్ అయ్యింది ఇక్క‌డే. అదే ఫార్ములా బోయ‌పాటి కూడా బాగా ప‌ట్టాడు. అందుకే శీను తీస్తున్న సీన్ల‌లో ర‌క్తం ఏరులై పారుతున్నా, రౌడీలు బంతుల్లా ఎగురుతున్నా న‌మ్మ‌బుల్‌గా ఉంటుంది. ఎక్కడ హీరోయిజం చూపించాలో, ఎక్క‌డ క‌త్తి దింపాలో, ఎక్క‌డ బుల్లెట్ వాడాలో.. శ్రీ‌నుకి బాగా తెలుస‌ని హీరోలు, అత‌ని సినిమా చూసి ఆనందిస్తున్న ప్రేక్ష‌కులు బాగా న‌మ్మారు. అయితే ఆ లెక్క‌లు త‌ప్పి కేవ‌లం ర‌క్త‌పాతం మిగిలిన బోయ‌పాటి శ్రీ‌ను సినిమా ఎలా ఉంటుంది? ఎమోష‌న్ మిస్స‌యిన యాక్ష‌న్ సినిమా బోయ‌పాటి శ్రీ‌ను చూపిస్తే ఎలా ఉంటుంది..? అచ్చం… విన‌య – విధేయ – రామ‌లా కాక‌పోతే..?!

క‌థ‌

నలుగురు అనాథ‌ల‌కు… మ‌రో అనాథ దొరుకుతాడు. రామ (రామ్‌చ‌ర‌ణ్‌) అనే పేరు పెట్టుకుని ఆ న‌లుగురూ.. త‌ల్లీతండ్రులుగా మారి ఆ బిడ్డ‌ని పెంచుతారు. వారిలో పెద్ద‌వాడు భువ‌న్ కుమార్ (ప్ర‌శాంత్‌) ఎల‌క్ష‌న్ క‌మీష‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. విశాఖ ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌వేళ పందెం ప‌ర‌శురామ్ (ముఖేష్ రుషి) అరాచ‌కాల్ని అడ్డుకుంటాడు. దాంతో పందెం ప‌ర‌శురామ్ ఈ కుటుంబంపై క‌క్ష్య పెంచుకుంటాడు. భువ‌న్‌కి బీహార్ ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. అక్క‌డ రాజూభాయ్ (వివేక్ ఓబెరాయ్‌) ప్ర‌భుత్వాన్ని త‌న గుప్పెట‌లోకి తీసుకుని, ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. అత‌న్నుంచి అన్న‌య్య‌కు, త‌న కుటుంబానికీ ముప్పు ఏర్ప‌డుతుంది. రాజూభాయ్‌ని ఎదిరించి త‌న కుటుంబాన్ని రామ్ ఎలా కాపాడుకున్నాడు? అనేదే విన‌య విధేయ రామ క‌థ‌.

విశ్లేష‌ణ‌

హీరో బ‌ల‌వంతుడు.. విల‌న్ రాక్ష‌సుడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే పోరు, చివ‌రికి శ‌త్రు సంహారం చేసి.. హీరో విజేత‌గా నిల‌వ‌డం… బోయ‌పాటి క‌థ‌లు ఇలానే సాగుతాయి. విన‌య విధేయ రామ అందుకు మిన‌హాయింపు కాదు. అడుగ‌డుగునా హీరోయిజం, యాక్ష‌న్‌, మ‌ధ్య‌లో విల‌న్ల ఆగడాలు, అక్క‌డ‌క్క‌డ పాట‌లు, విసుగు అనిపించిన‌ప్పుడు కాస్త కామెడీ… ఇలా పేర్చుకుంటూ పోయిన సినిమా ఇది. అయితే యాక్ష‌న్ సినిమాల్ని పండించ‌డం అంత సుల‌భం కాదు. హీరో వంద మందిని కొట్ట‌గానే హీరో అయిపోడు. ఫైటుకి ముందు కావ‌ల్సిన ప్రిప‌రేష‌న్ జ‌ర‌గాలి. బోయ‌పాటి ఈ విష‌యంలో చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించేవాడు. కానీ… అదంతా విన‌య విధేయ‌లో మిస్స‌య్యింది. దాంతో.. ఫైటుకి ఫైటు, పాట‌కి పాట‌, ఎమోష‌న్‌కి ఎమోష‌న్ అన్న‌ట్టు ఎక్క‌డిక‌క్క‌డ ముక్క‌లు ముక్క‌లుగా క‌నిపిస్తుంటుంది. తొలి స‌గంలో `బాగుంది` అనిపించుకున్న సీన్ ఏదైనా ఉందీ అంటే… అది ముఖేష్ రుషికి చ‌ర‌ణ్ `సారీ` చెప్ప‌డ‌మే. అయితే.. అది కూడా పేర్చుకున్న స‌న్నివేశ‌మే. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ చూస్తే త‌నెవ‌రికీ `సారీ` చెప్ప‌డ‌ని అర్థం అవుతుంది. అలాంటి హీరోని `సారీ` చెప్పించ‌డానికి విల‌న్ వ‌ర‌కూ తీసుకెళ్లాడంటే.. ఇది కావాల‌ని అతికించిన సీన్ అని అర్థ‌మ‌వుతుంది. అయితే.. ఆ స‌న్నివేశంలో చ‌ర‌ణ్ నుంచి ఆశించే యాక్ష‌న్‌, బోయ‌పాటి సినిమాల్లో చూడాల‌నుకునే ఎమోష‌న్ బాగా మిక్స‌య్యాయి. కాబ‌ట్టి.. లాజిక్కుని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అలాంటి స‌న్నివేశాలు నాలుగైదు ప‌డి ఉంటే.. చ‌ర‌ణ్ – బోయ‌పాటి కాంబినేష‌న్‌కి న్యాయం జ‌రిగేది. కానీ.. వ‌న్ సీన్ వండ‌ర్ అన్న‌ట్టు త‌యారైంది వ్య‌వ‌హార‌మంతా.

ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌లోనే సినిమాలో చూపించాల్సిన విధ్వంసం అంతా చూపించేశాడు బోయ‌పాటి. హీరోని వెదుక్కుంటూ బీహార్ నుంచి ఓ ముఖ్య‌మంత్రి వ‌చ్చి.. `బీహార్‌కి మీరు చేసిన సాయం అంతా ఇంతా కాదు` అని చేతులు జోడించ‌డం చూస్తే.. స‌ద‌రు హీరో బీహార్ వెళ్లి ఏదో పొడిచి వ‌చ్చాడు అన్నంత బిల్డ‌ప్ క‌నిపిస్తుంది. అంత హైప్ ఇచ్చిన‌ప్పుడు సెకండాఫ్ ఎలా చూపించాలి? ప్ర‌శాంత్ ఫోన్ చేసిన‌ప్పుడు.. చ‌ర‌ణ్ ఆఘ‌మేఘాల మీద‌… అజర్ బైజాన్‌కి వ‌చ్చేస్తాడు. ఆ సీన్‌లో ఎమోష‌న్స్ పీక్‌లో ఉంటాయ‌ని బోయ‌పాటి భ్ర‌మ‌. కానీ… తెర‌పై అంత విధ్వంసం, ర‌క్త‌పాతం జ‌రుగుతుంటే, `త‌ల‌కాయ‌లు` గాలిప‌టాల్లా ఎగురుతుంటే.. రోమాలు నిక్క‌బొడ‌వాల్సిందిపోయి న‌వ్వొస్తుంది. హీరో ట్రైన్ టాప్‌పై నిల‌బ‌డి ఎలా వ‌చ్చాడో.. త‌ను వ‌చ్చేంత వ‌ర‌కూ నిర‌స‌న దీక్ష చేస్తున్న‌ట్టు రౌడీ గ్యాంగ్ అంతా మౌనంగా ఓ చోట అలా కూర్చోవ‌డ‌మేంటో అర్థం కాదు. వివేక్ లోని క్రూర‌త్వం కోణాన్ని చూపించ‌డానికి పాముతో పొడిపించుకునే సీన్ అయితే… పిచ్చికి ప‌రాకాష్ట‌లా అనిపిస్తుంది. అంత వ‌ర‌కూ వంద‌ల వేల సైన్యంతో ఊర్ల‌మీద ప‌డి చెల‌రేగిపోయే రాజూ భాయ్‌… హీరో క‌నిపించ‌గానే ఒంట‌రైపోతాడు. చుట్టూ రాజూభాయ్ అనుచ‌రులు గ‌న్నులు ప‌ట్టుకుని వినోదం చూస్తారే గానీ.. హీరోపై ఎటాక్ చేయ‌రు. బ‌హుశా.. బోయ‌పాటి వాళ్ల‌కు `యాక్ష‌న్‌…` అని చెప్ప‌లేదేమో..? ఎమోష‌న్ మిస్స‌యితే.. తెర‌పై హీరోయిజాలు కూడా న‌వ్విస్తాయ‌ని, ఫైట్లు కామెడీలా మారిపోతాయ‌ని, సెంటిమెంట్ డైలాగులు కిత‌కిత‌లు పెట్టిస్తాయ‌ని.. ఈ సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది.

న‌టీన‌టులు

రంగ‌స్థ‌లం రామ్‌చ‌ర‌ణ్ కాస్త ర‌చ్చ‌లో రామ్ చర‌ణ్‌లా సాదా సీదాగా మారిపోయాడు. ఫైట్ల‌లో ఆవేశం, డాన్సుల్లో చురుకుద‌నం క‌నిపించినా.. క‌థ‌లో బ‌ల‌హీన‌త‌లు చ‌ర‌ణ్ పాత్ర‌నీ ఆవ‌హించేశాయి. కైరా అద్వానీ పాట‌కు ముందొచ్చి.. ప‌ద్ధ‌తిగా వెళ్లిపోయేది. ప్ర‌శాంత్ బాగా లావుగా క‌నిపించాడు. స్నేహాతో చివ‌ర్లో ఓవ‌రాక్ష‌న్ చేయించాడు శ్రీ‌ను. వివేక్ ఓబెరాయ్‌ని తీసుకొచ్చి చేయించే పాత్ర కూడా కాదిది. తెర‌పై న‌టీన‌టులు బోలెడుమంది క‌నిపిస్తారు. కానీ.. ఏ పాత్ర గుర్తుండ‌దు. ఫైట్ల‌లో క‌నిపించే విధ్వంసం త‌ప్ప‌..

సాంకేతిక వ‌ర్గం

దేవిశ్రీ ప్ర‌సాద్ మాట‌లు మాసీగా ఉన్నాయి.. కానీ గుర్తిండిపోయే ట్యూన్లు లేవు. ఫైట్స్‌కి ముందు బీజియ‌మ్స్ ఓకే అనిస్తాయి. కొన్న‌యితే ప‌దే ప‌దే రిపీట్ అయిన‌ట్టు అనిపిస్తుంది. సినిమాని బాగా రిచ్‌గా తీశారు. కెమెరాప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌తీసీన్ లావీష్‌గా ఉంది. యాక్ష‌న్ స‌న్నివేశాలకు డ‌బ్బు బాగా ధార‌బోసిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. అజ‌య్ బైజాన్‌లో తీసిన యాక్ష‌న్ సీన్ ఈ సినిమాకే హైలెట్ అని చిత్ర‌బృందం గ‌ట్టిగా చెప్పింది. కానీ.. ఈ సినిమాలో అదో కామెడీ పీస్‌గా మిగిలిపోయింది. యాక్ష‌న్ కోసం యాక్ష‌న్ అనే ఫార్ములాతో బోయ‌పాటి ఎప్పుడూ సినిమా తీయ‌లేదు. తొలిసారి.. త‌న యాక్ష‌న్‌లో కేవ‌లం యాక్ష‌నే క‌నిపించింది.

తీర్పు

ఫైట్ల కోసం సినిమాలు చూసే రోజులు పోయాయి. యాక్ష‌న్ సీన్లు పండాలంటే.. అందుకు బ‌ల‌మైన ఎమోష‌న్లు రాసుకోవాలి. అప్పుడు హీరో విధ్వంసం సృష్టించినా విన‌యంగా క‌నిపిస్తుంది. లేదంటే ఎంత‌టి విన‌యం చూపించినా.. విధ్వంసంలా మారిపోతుంది.

ఫైన‌ల్ ట‌చ్‌: ‘త‌డిసిపోయిన అగ్గిపుల్ల‌’

తెలుగు360 రేటింగ్‌: 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు.. డీజీపీ పర్మిషన్ ఇచ్చారు..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మధ్యాహ్నం హోంమంత్రి సుచరిత చంద్రబాబు దరఖాస్తు చేసుకోలేదని మీడియాతో చెప్పడంతో... చంద్రబాబు పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే...

జగ్గారెడ్డి, టీవీ9 మీద ఈగ వాలనీయడం లేదుగా..

జగ్గారెడ్డి అంటే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ నేత. అధికారంలో ఉన్న కెసిఆర్ , ఆయన కుటుంబ సభ్యుల మీద పదునైన విమర్శలు చేయడానికి విపక్ష నేతలు భయపడుతూ ఉన్న సమయంలో కూడా జగ్గారెడ్డి...

ఎల్జీ పాలిమర్స్‌ కేసులో ఆ వివరాలన్నీ చెప్పాలన్న హైకోర్టు..!

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై... హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సుమోటోగా విచారణ చేయడంతో పాటు.. హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై .. విచారణ జరిపి... అనేక...

బాపట్ల ఎంపీ..మందడంలో భూమాయ..!?

కోర్టులపై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని తరలింపునకు బహిరంగంగా మద్దతు పలుకుతున్న నందిగం సురేష్.. సచివాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ...

HOT NEWS

[X] Close
[X] Close