థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం గగనం అయిపోతున్న తరుణం ఇది. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇదే పరిస్థితి. అలాంటప్పుడు చిన్న సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? కంటెంట్ తో ఆకట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. చిన్న సినిమాలకు కంటెంట్ ఉంటే సరిపోవడం లేదు. ఇంకా ఏదో కావాలి. ప్రేక్షకుల్ని ఆ సినిమా గురించి మాట్లాడుకొనేలా చేయాలి. అందుకే అందరూ రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇప్పుడు ‘వర్జిన్ బోయ్స్’ టీమ్ కూడా ఇలానే కొత్త తరహాలో ఆలోచించింది.
ఈ సినిమా టికెట్ కొన్నవాళ్లలో 11 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి, వాళ్లకు ఐఫోన్స్ బహుమతిగా ఇవ్వబోతున్నారు. అంతేకాదు… మనీ రైన్ అనే కొత్త కాన్సెప్ట్ ని ఈ సినిమాతో ప్రవేశ పెట్టారు. సినిమా ఆడుతున్న థియేటర్లో ఏదో ఓ సమయంలో డబ్బుల వాన కురుస్తుంది. ఎవరికి దొరికింది వాళ్లు తీసుకోవొచ్చు. ఇదంతా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నాల్లో భాగమే. మిత్రశర్మ, గీతానంద్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ కూడా ఈరోజే విడుదలైంది. యూత్ సినిమా కాబట్టి, కాస్త సినిమాలో మసాలా గట్టిగా దట్టించిన వైనం కనిపిస్తోంది.
నిజానికి ఈనెల 11న ‘ఘాటీ’ రావాల్సింది. ఆ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. దాంతో బాక్సాఫీసు దగ్గర కాస్త గ్యాప్ దొరికింది. దాంతో చిన్న సినిమాలు వరుస కడుతున్నాయి. ఇటీవల కొన్ని చిన్న సినిమాలు ఊహించని విధంగా లాభాలు ఆర్జించాయి. ‘మ్యాడ్ 2’ నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ‘వర్జిన్ బోయ్స్’ కూడా యూత్ పైనే ఆశలు పెట్టుకొంది.