ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నాన్ని గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, డేటా సెంటర్లు , స్టార్టప్ సంస్కృతి వేగంగా విస్తరిస్తుండటంతో నగరంలోని కీలక ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటీ నిపుణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పుడు పెట్టుబడికి అత్యంత సురక్షితమైన మరియు లాభదాయకమైన ప్రాంతంగా విశాఖను ఎంచుకుంటున్నారు. దీంతో గడచిన కొద్ది నెలలుగా నగర శివార్లలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
మధురవాడ – ఐటీ కారిడార్‌గా అగ్రస్థానం
నగరంలో రియల్ ఎస్టేట్ డిమాండ్‌కు మధురవాడ కేంద్రబిందువుగా మారింది. ఐటీ హిల్స్, ఇన్ఫోసిటీ వంటి ప్రాజెక్టులకు సమీపంలో ఉండటంతో ఐటీ ఉద్యోగులు ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు అత్యంత ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, హై-రైజ్ అపార్ట్మెంట్ల నిర్మాణం జోరందుకుంది. సముద్ర తీరానికి సమీపంలో ఉండటం, మెరుగైన మౌలిక సదుపాయాలు లభించడంతో మధ్యతరగతి ,ఎగువ మధ్యతరగతి వర్గాల వారు మధురవాడ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ చదరపు అడుగు ధరలు గత ఏడాది కంటే సుమారు 20-25 శాతం పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఆనందపురం – భవిష్యత్ పెట్టుబడుల స్వర్గం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగవంతం కావడంతో ఆనందపురం ప్రాంతం రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా అవతరించింది. విశాఖను విమానాశ్రయంతో కలిపే ప్రధాన రహదారిపై ఉండటంతో, ఇక్కడ ప్లాట్ల కొనుగోలుకు భారీ డిమాండ్ ఏర్పడింది. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక శాటిలైట్ సిటీగా మారుతుందన్న అంచనాతో ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. నివాస గృహాలతో పాటు కమర్షియల్ స్పేస్‌లకు కూడా ఇక్కడ గిరాకీ పెరగడం గమనార్హం. కేవలం నివాసం కోసమే కాకుండా, దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా ఆనందపురం ఇప్పుడు బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.
గాజువాక, అనకాపల్లి – పారిశ్రామికాభివృద్ధి డిమాండ్
నగరానికి మరోవైపు ఉన్న గాజువాక ప్రాంతం పారిశ్రామిక ,ఐటీ ఉద్యోగుల కలయికతో కిక్కిరిసిపోతోంది. అచ్యుతాపురం సెజ్, అనకాపల్లి జిల్లాలో నూతనంగా వస్తున్న భారీ పరిశ్రమలు, ముఖ్యంగా ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ వంటి ప్లాంట్ల ఏర్పాటు గజువాక రియల్ ఎస్టేట్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. ఇటు పారిశ్రామిక అవసరాలు, అటు నివాస గృహాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో , అనకాపల్లి వైపు వెళ్లే రహదారుల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తుండటంతో ఈ ప్రాంతం త్వరలోనే భారీ కమర్షియల్ హబ్‌గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
