పాన్ ఇండియా మాట ఇప్పుడు పాతబడిపోయింది. పాన్ వరల్డ్, గ్లోబల్ సినిమా అనే మాట కొత్తగా రాసుకోవాల్సివస్తోంది. మీడియం రేంజ్ సినిమాలు కూడా ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. తాజాగా విశ్వక్సేన్ సినిమా కూడా ‘పాన్ గ్లోబల్’ ట్యాగ్ లైన్ తో విడుదల అవుతోంది. విశ్వక్ సేన్ దర్శకత్వంలో ‘కల్ట్’ అనే సినిమా ఈరోజే కొబ్బరికాయ కొట్టుకొంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలెట్టేశారు. ఈ సినిమాతో 40 మంది కొత్తవారిని పరిచయం చేయబోతున్నాడు విశ్వక్. తాను కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ సంభాషణలు అందిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. టెక్నికల్ గా స్ట్రాంగ్ టీమ్ నే తీసుకొన్నాడు విశ్వక్.
ఇదో యాక్షన్ థ్రిల్లర్. కానీ ఇప్పటి వరకూ మనం చూసిన సినిమాల్లా ఉండదట. ఈ తరహా కథ, కథనాలు వెండి తెరపై చూడడం ఇదే తొలిసారి అంటూ విశ్వక్ ప్రకటించాడు. గ్లోబల్ అప్పీల్ ఉంది కాబట్టే.. జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్లలోనూ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేస్తామని చెబుతున్నాడు విశ్వక్. నిజానికి ‘కల్ట్’ సినిమా కోసం దర్శకత్వానికే పరిమితం అవ్వాలని అనుకొన్నాడు విశ్వక్. కానీ చివరి నిమిషంలో మేకప్ కూడా వేసుకోవాల్సివచ్చింది. 40 మంది కొత్త నటీనటుల్ని ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేశాడు విశ్వక్. ఇటీవల ‘లైలా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్. ఆ సినిమా బాగా నిరుత్సాహ పరిచింది. అడల్ట్ కంటెంట్ ఎక్కువ అయ్యిందంటూ, బూతులు హెచ్చు మీరాయంటూ విమర్శల్ని ఎదుర్కొన్నాడు. ఆ తరవాత విశ్వక్ ‘సారీ’ కూడా చెప్పాడు. ఇక మీదట అందరికీ నచ్చే సినిమాలు తీస్తానంటూ హామీ ఇచ్చాడు. మరి ఈ `కల్ట్` ఎలా ఉండబోతోందో?