గతేడాది విడుదల కావాల్సిన సినిమా ‘విశ్వంభర’. అయితే అనుకోని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ‘విశ్వంభర’ తరవాత సెట్స్ పైకి వెళ్లిన `మన శంకర వర ప్రసాద్ గారు’ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి.. ఓటీటీలోకి కూడా వచ్చేస్తోంది. కానీ ‘విశ్వంభర’ ఇంకా ముందుకు కదలడం లేదు. జులైలో ఈ సినిమాని విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై కూడా క్లారిటీ లేదు.
ఈ సినిమాకు ముందు నుంచీ వీఎఫ్ఎక్స్ తోనే సమస్య. అవుట్పుట్ పై మెగాస్టార్ సంతృప్తిగా లేరు. దాంతో మళ్లీ రీవర్క్ చేశారు. ఇప్పటికీ కొన్ని సీజీ షాట్స్ పెండింగ్ లో ఉన్నాయట. అవన్నీ పూర్తవ్వాలంటే డబ్బులు కావాలి. యూవీ క్రియేషన్స్ పరిస్థితి చాలా టైట్ గా ఉంది. వాళ్లకు ఫండింగ్ దొరకడం లేదు. శర్వానంద్ `బైకర్`పై పెట్టుబడి పెట్టారు. ఆ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా విడుదలై, డబ్బులు వస్తే, వాటిని ‘విశ్వంభర’పై ఖర్చు చేయాలని చూస్తున్నారు. మరోవైపు వీఎఫ్ఎక్స్ చేతికి ఎప్పుడు వస్తాయో తెలీదు. వాటి అవుట్ పుట్ ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి రిలీజ్ డేట్ పై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం కష్టమని సమాచారం. ఈలోగా చిరు తన కొత్త సినిమాని కూడా మొదలెట్టేస్తారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
