స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె చేస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులంతా సమ్మె కు వెళ్తున్నారు. వారికి మద్దతుగా పర్మినెంట్ ఉద్యోగులు ఒక రోజు విధులను బహిష్కరిస్తున్నారు. ఈ పరిణామంతో స్టీల్ ప్లాట్ కు ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కార్మికులు ఆ ఊపిరిని లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల ఎవరికి నష్టం ?
సమ్మె చేస్తే నష్టపోయేది స్టీల్ ప్లాంటే !
పరిశ్రమ అన్నాక సమస్యలు ఉంటాయి. యాజమాన్యం కార్మికుల సమస్యలు అన్నింటినీ పరిష్కరించలేదు. వారికీ సమస్యలు ఉంటాయి. స్టీల్ ప్లాంట్ కు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి సమయంలో కార్మికులు తమ సంస్థను కాపాడుకునేందుకు ఇంకా ఎక్కువ ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంది. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సంస్థలో ఉత్పత్తి పెంచి లాభాల బాటలోకి తీసుకు వస్తే.. అప్పుడు ఎలాంటి డిమాండ్లను అయినా చేయడానికి అవకాశం ఉంటుంది.కానీ ఊపిరిపోయే దశలో మరింతగా పీక నొక్కేలా చేస్తే ఆ సంస్థ మనుగడ ఎలా సాధ్యమవుతుంది ?
సమ్మెలనే ఆలోచనే వెనుకబాటు తనానికి నిదర్శనం !
సమ్మె అనే ఆలోచనే వెనుకబాటుతనానికి నిదర్శనం. ఒకప్పుడు కార్మిక సంఘాలు తన నిరసన చేయడానికి పని మానుకోవడమే పెద్ద మార్గం అని మనసులో పెట్టాయి. దాని ప్రకారం సమ్మె అని అసువుగా ప్రకటిస్తున్నారు. కానీ చాలా దేశాల్లో ఎక్కువ పని చేసి నిరసన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే తమ నిరసన అనేది సంస్థకు నష్టం చేయడం ద్వారా కాదు.. యాజమాన్యానికి తమ ఆకాంక్షలు ఎంత న్యాయమైనవో తెలిసేలా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తూ ఇండియాలో ఇంకా సమ్మెలు అంటే.. యాజామన్యానికి బెదిరింపులు అనుకుంటున్నారు.
కార్మికులకే ఇష్టం లేకపోతే ఇక ప్రభుత్వాలేం అవసరం ?
స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలని ప్రభుత్వాలు చాలా కష్టపడుతున్నాయి. వేల కోట్లు కేటాయిస్తున్నాయి. ఇటీవల పదివేల కోట్లకుపైగా ప్యాకేజీని కేంద్రం ఇచ్చింది. దాన్ని ఉపయోగించుకుని మళ్లీ ప్లాంట్ ను గాడిన పెట్టుకోవాల్సింది పోయి.. సంస్థ యాజమాన్యాన్ని నిర్ణయాలు తీసుకోనివ్వకుండా.. ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు పడుతూ.. అడ్డం పడుతున్నారు. సమ్మెలు చేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని రెచ్చగొట్టడానికి రాజకీయ పార్టీలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. వారి ట్రాప్ లో పడటం కన్నా పిచ్చితనం ఉండదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెలు చేయాల్సిన సందర్భం కాదు.. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లి కాపాడుకోవాల్సిన సమయం.