కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ తనదైన లీడర్షిప్ తో విద్యా రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. దశాబ్దాల చరిత్ర ఉండి, నిధుల కొరతతో అకస్మాత్తుగా మూతబడిన విశాఖపట్నం ఉక్కునగరంలోని ప్రతిష్టాత్మక విశాఖ విమల విద్యాలయం ను ప్రభుత్వమే స్వయంగా బాధ్యతలు తీసుకుని పునఃప్రారంభించేలా చేయడంలో లోకేష్ చూపిన చొరవ అమోఘం. ఒక పాఠశాల మూతపడితే వేలాది మంది నిరుపేద, నిర్వాసిత కార్మిక కుటుంబాల పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో.. కేవలం ఐఏఎస్ అధికారులకే బాధ్యత వదిలేయకుండా తానే స్వయంగా పర్యవేక్షించి, ఈ విద్యా సంవత్సరం నుంచే బడి గంట మోగేలా లోకేష్ చేసిన కృషి అద్భుత ఫలితాలను ఇస్తోంది.
స్టీల్ ప్లాంట్ కార్మికుల పిల్లలకు విద్య అందించే విమల విద్యాలయం
ఈ ప్రతిష్టాత్మక పాఠశాల ఉనికిని కాపాడటం వెనుక ఒక పెద్ద కథే ఉంది. 1984లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితుల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు ఆర్ సీఎం డయాసిస్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు స్కూలును ప్రారంభించింది. దాదాపు 40 ఏళ్ల పాటు నిరుపేదల విద్యా నిలయంగా వెలిగిన ఈ స్కూలుకు.. జూన్ 2024లో ఆర్ఐఎన్ఎల్ సంస్థ ఆర్థిక సహాయాన్ని అకస్మాత్తుగా నిలిపివేయడంతో తాళం పడింది. దాదాపు 2,200 మంది విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోగా, 100 మంది టీచర్లు, సిబ్బంది రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితిని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన యుద్ధప్రాతిపదికన స్పందించారు.
స్టీల్ ప్లాంట్ నిధులు ఆపేయడంతో మూత
మంత్రి లోకేష్ ఈ సమస్యను ఒక సాధారణ బడి మూతపడటంగా చూడకుండా, దశాబ్దాల నాటి విద్యా వారసత్వాన్ని కాపాడేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. కేవలం కార్పొరేట్ శక్తులకు పాఠశాలను అప్పగించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పి.. ప్రభుత్వమే ఈ పాఠశాల పూర్తి నిర్వహణ బాధ్యతలను తీసుకునేలా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. వైజాగ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ వ్యాలీ స్కూల్ మోడల్లో.. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఒక ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో విమల విద్యాలయంను నడిపించాలని, దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని అధికారులకు లోకేష్ దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ఆయన చేసిన నిరంతర పర్యవేక్షణతో జూన్ 12న జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా స్కూల్ మళ్లీ ముస్తాబై తెరుచుకుంది.
ప్రత్యేక ప్రయత్నాలతో మళ్లీ ప్రారంభింపచేసిన లోకేష్
మంత్రి లోకేష్ తీసుకున్న చొరవ ఎంతటి భరోసా ఇచ్చిందంటే.. పునఃప్రారంభమైన మొదటి రోజుల్లోనే యూకేజీ నుండి 10వ తరగతి వరకు ఏకంగా 778 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో కొత్తగా అడ్మిషన్లు పొందారు. అంతటితో ఆగకుండా, పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మంత్రి ఆదేశాల మేరకు నేటి నుంచే పాఠశాలలో మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని కూడా ఘనంగా ప్రారంభించారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంతో పట్టుబట్టి, చర్చలు జరిపి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రూ. 12,000 కోట్ల భారీ ప్యాకేజీ సాధించడంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్.. అదే స్టీల్ ప్లాంట్ నడిబొడ్డున ఉన్న విమల విద్యాలయాన్ని కూడా పునఃప్రారంభించి అటు కార్మికులకు, ఇటు వారి పిల్లల చదువులకు తానే కొండంత అండగా నిలబడ్డారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో లోకేష్ ఇమేజ్ మరోస్థాయికి చేరింది.
