బీహార్లో నిర్వహించిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఇక దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అది మంగళవారం నుంచే ప్రారంభమవుతుంది. ఆ పన్నెండు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బెంగాల్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, గుజరాత్ వంటి కీలక రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగురాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి ఓటర్ జాబితా సవరణ చేపట్టడం లేదు. తదుపరి విడతలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సవరణ చేపట్టే అవకాశం ఉంది.
శాశ్వతంగా వలస వెళ్లిపోయిన వాళ్లు, చనిపోయిన వాళ్లు, అక్రమంగా చొరబడిన వారి ఓట్లను తీసేసందుకు ఈ ప్రక్రియ చేపట్టారు. ఇలాంటి వారి ఓట్లు ఉండటం వల్ల ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా ఉంటోంది. ముఖ్యంగా మెట్రో నగరాలు ఉన్న ప్రాంతాల్లో అయితే ఓటింగ్ శాతం యాభై శాతం కూడా నమోదు కావడం లేదు. దీనికి ఓటర్ల జాబితాలో లోపాలే కారణం అన్న ఆరోపణలు ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఇలాంటి సర్ ప్రక్రియ చేపట్టలేదు.అందుకే 2003 నాటికి ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వారు ఎలాంటి పత్రాలు సబ్ మిట్ చేయాల్సిన పని లేదు.
ఆ తర్వాత ఓటర్లజాబితాలో తమ పేరు నమోదు చేసుకున్న వారు ఏదో ఒక పత్రం చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు పౌరసత్వ గుర్తింపు కాదు. అయితే ఇతర పత్రాలను చూపించవచ్చు. నిజానికి సరిహద్దు రాష్ట్రాల్లో చొరబడిన వారు ఉన్న చోట్ల ఈసమస్య ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద సమస్య కాదు. అయితే ఇప్పుడే ఎలాంటి ప్రక్రియ చేపట్టడం లేదు కాబట్టి.. తెలుగు రాష్ట్రాల్లో దీనిపై ఎలాంటి రాజకీయం జరిగే అవకాశం లేదు.