భాషాభిమానం మన కంటే మన పక్క రాష్ట్రాల వాళ్లకు ఎక్కువ. ఈ విషయంలో వాళ్లని అభినందించాల్సిందే. కానీ వాళ్ల అభిమానాన్ని తెలుగు ప్రేక్షకులపై బలవంతంగా రుద్దడం మాత్రం భరించలేని విషయం. ఈమధ్య కొన్ని తమిళ, మలయాళ, కన్నడ సినిమాల టైటిళ్లు చూస్తుంటే .. `ఇవేం టైటిళ్లు?` అనిపిస్తుంది. సినిమాని తెలుగులో డబ్ చేసి.. టైటిళ్లని మాత్రం యదాతథంగా వదిలేస్తున్నారు. కొన్నింటికి అర్థాలు ఉండడం లేదు. ఇంకొన్ని అర్థం కావడం లేదు. కొన్నయితే ఏకంగా బూతులే.
తమిళ సినిమా ‘రెట్ట తల’ (అంటే రెండు తలలు అని అర్థం) తెలుగులో అదే పేరుతో డబ్ చేశారు. రెట్ట తలో.. పిట్ట తలో, పిట్ట రెట్టో అర్థం కాని తెలుగు ప్రేక్షకులు ఇదేం టైటిల్ అని బుర్ర గోక్కొంటున్నారు.
‘కొత లోక’ అనే మరో టైటిల్. మలయాళ సినిమా ఇది. ‘కొత్త లోకం’ అని అర్థం. తెలుగులో అలానే రిలీజ్ చేయొచ్చు కదా.? కానీ చేయరు. ఎందుకంటే వాళ్ల భాషపై వాళ్లకున్న అభిమానం అట.
‘పూ*’ అనే పేరుతో ఓ పోస్టర్ వదిలింది చిత్రబృందం. తమిళంలో దానికి అర్థం ఏమిటో కానీ, తెలుగులో పచ్చి బూతు. ఇలాంటి టైటిల్స్ తో సినిమాలు తీస్తే.. జనాలు ఏ మొహం పెట్టుకొని థియేటర్లకు వెళ్లాలి?
నరివెట్ట, తుడరమ్, పెండుళమ్, అగాథియా, వెట్టయాన్, ఎంపురన్ ఇవన్నీ తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమాల పేర్లు. అవి వచ్చాయి. జనం చూశారు. కొన్నింటిని ఆహా.. ఓహో అని కూడా అన్నారు. ఇది వరకు ఈ పైత్యం ఉండేది కాదు. తెలుగులో సరైన అర్థం వెదికి మరీ టైటిల్ గా పెట్టేవారు. ఆ టైటిళ్లు కూడా చాలా క్యాచీగా, అర్థవంతంగా ఉండేవి. ఇప్పుడు మాత్రం అలా కాదు. పాన్ ఇండియా మొత్తం తెలిసేలా టైటిల్ ఉండాలనో, లేదంటే మన భాష.. ఇతర చోట్ల కూడా వెలగాలనో.. ఒరిజినల్ టైటిల్ ని దింపేస్తున్నారు. ఇది ఓరకంగా.. పైత్యమే.
భాషపై నిజంగా అంత అభిమానమే ఉంటే డబ్బింగ్ చేయడం ఎందుకు? వాళ్ల భాషలోనే సినిమాని విడుదల చేయాలి కదా? అప్పుడు వాళ్ల భాష మరింత వెలుగుతోంది కదా..? ఓ తెలుగు సినిమాని అదే పేరుతో తమిళంలో విడుదల చేస్తే చూస్తారా? వాళ్లకు లేని పరభాషా సహనం మనకు ఎందుకు? తెలుగు పేర్లు లేని సినిమాల్ని తెలుగులో విడుదల చేయం అని భీష్మించుకొని కూర్చుంటే వాళ్లెందుకు లొంగరు? నిజంగా దేశం అంతా ఒకే టైటిల్ తో పాపులర్ అవ్వాలన్న కమర్షియల్ యాంగిల్ లో ఆలోచిస్తే.. అందరికీ తెలిసేలా ఇంగ్లీష్ టైటిల్ ఎంచుకొంటే సుఖం కదా? ఇన్ని తలనొప్పులు ఉండేవి కావు.
ఏమైనా.. తమ సొంత భాష ని ఇతర ప్రేక్షకుల పైనా బలవంతంగా రుద్దే ఈ దుర్మార్గాన్ని ఆపి తీరాలి. దీనిపై తెలుగు బాషాభిమానులు స్పందించాలి. ఇలాంటి సినిమాల్ని బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించాలి. అప్పుడు కానీ.. ఈ పైత్యం తగ్గదు.