పూనకాలు లోడింగ్.. అంటూ ‘వాల్తేరు వీరయ్య’కు ఓ క్యాప్షన్ ఇచ్చారు. ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే.. ట్రైలర్ కట్ చేశారు. చిరంజీవి, రవితేజ కలిసి నటించిన సినిమా ఇది. బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13న సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్ ఈ సినిమా. దానికి ఓ శాంపిల్ లా ఉంది.. ట్రైలర్. అడుగడుగునా ఎలివేషన్లు. యాక్షన్, చిరు మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్… ఇలా సాగింది ట్రైలర్.
”మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే.. ఆయన్ని చూసి..” అనే డైలాగ్ తో చిరుకి భారీ ఇంట్రడక్షన్ ఇచ్చారు. అక్కడ్నుంచి చిరంజీవి హంగామా మొదలైపోయింది. వాల్తేరు వీరయ్యగా తన గెటప్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్.. ఇవన్నీ మాస్‌కి, ముఖ్యంగా చిరంజీవి అభిమానులకు నచ్చేలా ఉన్నాయ్. ”మీ కథలోకి నేను రాలా.. నా కథలోకే మీరందరూ వచ్చారు” అనే డైలాగ్ తో.. ఈ ట్రైలర్ యాక్షన్ టర్న్ తీసుకొంది. ”మీరు నా ఎర.. నువ్వే నా సొర..” అంటూ రవితేజకు వార్నింగ్ ఇవ్వడం..
”వైజాగ్‌లో గట్టి ఏటగాడు లేడని.. ఓ పులి పూనకాలతో ఊగుతోందట” అంటూ రవితేజ కౌంటర్ ఇవ్వడం.. గూజ్‌బమ్ మూమెంట్స్.
రికార్డ్స్‌లో నీ పేరుందన్నమాట.. అని బాబీ సింహా అంటే…
”రికార్డ్స్ లో నా పేరు ఉండడం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్..” అని చిరు చెప్పడం – వన్స్ మోర్ అనిపించే డైలాగ్.
చివర్లో ఫినిషింగ్ టచ్ కూడా అదిరింది. చిరంజీవి, రవితేజలు పరస్పరం తమ ఫేవరెట్ డైలాగుల్ని మార్చుకొన్నారు.
”హలో మాస్టారూ.. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి..ఒకొక్కడికీ బాక్సులు బద్దలైపోతాయ్” అని రవితేజ అంటే..
”ఏంట్రా బద్దలైపోయేది.. ఈ సిటీకి ఎంతో మంది కమీషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ వీరయ్య లోకల్..” అని చిరు చెప్పడం ఆకట్టుకొంటుంది. మొత్తానికి మాస్ మసాలా కమర్షియల్ సినిమాకి నిర్వచనంలా ఉంది ట్రైలర్. సినిమా కూడా ట్రైలర్‌లానే ఉంటే.. సూపర్ హిట్టు ఖాయం.