రివ్యూ: వాల్తేరు వీరయ్య

Waltair Veerayya review

తెలుగు360 రేటింగ్ : 2.25/5

కమర్షియల్ సినిమాలకి చిరునామా చిరంజీవి. డ్యాన్సులు, పాటలు, ఫైట్లు, కామెడీ.. ఇవన్నీ మిక్స్ చేసి మాస్ మసాలా వినోదం అందించడంలో ఆయన మెగాస్టార్. నిజానికి అభిమానులు ఆయన నుంచి కోరుకునేది కూడా ఇలాంటి వినోదాత్మక చిత్రాలే. స్వయం కృషి ,శుభలేఖ, రుద్రవీణ లాంటి క్లాసిక్స్ ఆయన ఖాతాలో ఉన్నప్పటికీ చిరంజీవి అంటే ఠక్కున గుర్తుకొచ్చేవి ఘరానా మొగుడు, ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలే. ఐతే అలాంటి సినిమా ఆయన నుండి వచ్చి చాలా కాలమైయింది. ఇప్పుడు అలాంటి సినిమాని అందించే బాధ్యత దర్శకుడు బాబీ తీసుకున్నాడు. వింటేజ్ చిరంజీవి ని చూపించాలనే లక్ష్యంగా ‘వాల్తేరు వీరయ్య’ ని తయారు చేశాడు. దీనికి రవితేజ మాస్ కూడా తోడై మెగా మాస్ గా మారింది. పూనకాలు లోడింగ్ అంటూ అంచనాలు పెంచారు. ఎన్ని అంచనాలు పెట్టుకున్న వాటిని వీరయ్య దాటేస్తాడు అని స్వయంగా చిరంజీవే చెప్పారు. మరి వాల్తేరు వీరయ్య పూనకాలు లోడ్ అయ్యాయా? తెరపై మెగా మాస్ మేజిక్ చేసిందా ? వింటేజ్ చిరంజీవి ప్రేక్షకులని అలరించాడా ?

వైజాగ్ సముద్రం ఒడ్డున జాలరిపేటలో వుండే వీర‌య్య (చిరంజీవి) ఓ ముఠామేస్త్రీ. ఒక చిన్న సైజు గ్యాంగ్ లీడర్. సముద్రంలో చేపల వేటతో పాటు పోర్ట్‌లో ఐస్ ఫ్యాక్టరీ కూడా నడుపుతుంటాడు. సాల్మన్ సీజ‌ర్ (బాబీ సింహా) డ్రగ్ మాఫియా లీడర్. అతడ్ని పోలీసులు బంధించి తీసుకొస్తుండగా ప్లెయిన్ క్రాష్ లాండింగ్ వుంటుంది. దీంతో మారేడుమిల్లి అనే ఓ చిన్న ఊరిలోని పోలీస్ స్టేషన్ లో ఓ రాత్రి వుంచాతారు. ఆ స్టేషన్ సిఐ సీతాప‌తి (రాజేంద్రప్రసాద్‌). పోలీస్ స్టేషన్ లో వున్న సీజర్ ని విడిపించడానికి వచ్చిన అతని గ్యాంగ్ పోలీసులందరినీ ఊచకోత కోసి మలేషియా పారిపోతుంది. దీంతో సిఐ సీతాపతి కుమిలిపోతాడు. ఎలాగైనా సాల్మన్‌ అంతు చూడాలని నిర్ణయించుకుంటాడు. సాల్మన్‌ని మ‌లేషియా నుంచి తీసుకురావడానికి వీరయ్యని ఆశ్రయిస్తాడు. ఆ పని చేయాలంటే రూ. 25 ల‌క్షలు డిమాండ్ చేస్తాడు వీరయ్య. ఇద్దరి మ‌ధ్యా ఒప్పందం కుదురుతుంది. అలా మ‌లేషియా వెళ్ళిన వీర‌య్య… సాల్మన్ సీజ‌ర్‌తోపాటు, అత‌ని అన్న కాలా అలియాస్ మైఖేల్ సీజ‌ర్ ని టార్గెట్ చేస్తాడు. అసలు వీరయ్య మలేసియా వచ్చిందే కాలా కోసం. ఇంతకీ కాలా ఎవరు ? వీరయ్య కథలో కాలా పాత్ర ఏమిటి? ఏసీపీ విక్రమ్‌సాగ‌ర్ (ర‌వితేజ‌) ఎవరు? వీరయ్యకి సాగర్ కి మధ్య వున్న అనుబంధం ఏమిటి ?అనేది మిగతా కథ.

తన తమ్ముడికి దక్కాల్సిన గౌరవం కోసం ఖండాలు దాటి పోరాటం చేసిన ఓ అన్నయ్య కథ వాల్తేరు వీరయ్య. కథగా చూస్తే వీరయ్య బీసీ కాలం నాటిది. ఈ పాత కథనే చిరంజీవి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ కలిపేసి తీసేద్దామనుకొని రంగంలో దిగారు తప్పితే.. దీనిని ఎంత ఆసక్తికరంగా చచూపించాలనే పాయింట్ పై ఏ మాత్రం పని చేసినట్లు కనిపించదు. వాల్తేరు వీరయ్యలో చాలా బలహీనమైన రచన కనిపిస్తుంది. ఈ సినిమా రైటింగ్ టేబుల్ మీద ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి సినిమాలోని మొదటి సీనే ఊదాహరణ. ఒక పెద్ద ఇంటర్ నేషనల్ డ్రగ్స్ మాఫియా లీడర్ ని అనుకోని పరిస్థితిలో చిన్న జైల్లో పెడతారు. అంత పెద్ద గ్యాంగ్ స్టార్ దగ్గరికి ఒక కానిస్టేబుల్ వెళ్లి మంచి నల్లిముక్కల మటన్ కూర భోజనం పెడతాడు. విలన్ గ్యాంగ్ వచ్చి పోలీసులని పిట్టలు కాల్చినట్లు కాల్చేస్తారు. మాఫియా డాన్.. మటన్ నల్లిని తీసుకొని అందులో నుంచి డ్రగ్స్ పీల్చుతాడు. ఈ వ్యవహారం అంతా ఎలివేషన్ కోసం ఇచ్చినట్లు వుంటుంది తప్పా.. ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కి ఇంటికి వచ్చిన అల్లుడిలా ఓ అర్ధరాత్రి మటన్ కూరతో భోజనం పెట్టడం ఏ పోలీసు స్టేషన్ లో జరుగుతుందా ? అనే అనుమానం కలుగుతుంది.

హీరో ఎంట్రీని కూడా ఇలాంటి బలవంతపు ఎలివేషన్ తోనే డిజైన్ చేశాడు దర్శకుడు. మొదట వీరయ్య వాయిస్ విని ఓ రౌడీ ప్యాంట్ తడిపేసుకుంటాడు. తర్వాత సముద్రంలో నావీకి హెల్ప్ చేస్తూ వీరయ్య దర్శనమిస్తాడు. ఆ ఎలివేషన్ అంతా చూస్తుంటే .. ఏంటి మన దేశ నావికాదళం మరీ ఇంత బలహీనంగా ఉందా ? అనే అనుమానం రాకమానదు. పోనీ నేవీకి హెల్ప్ చేసిన వీరయ్య కాండక్ట్ అద్భుతమా అంటే అదీ లేదు. తర్వాత సీన్ లోనే కోర్టు కేసులో కనిపిస్తాడు. ఆ కేసు ఏంటో క్లారిటీ ఇవ్వరు. ఆ కేసుని వాయిదా వేయించి పాతిక లక్షల కోసం మలేసియా జంప్ కొడతాడు వీరయ్య. అక్కడ కొన్ని కామెడీ సీన్లు. హీరోయిన్ శ్రుతి హాసన్ తో లిఫ్ట్ ఆట. ఇంటర్వెల్ వరకూ ఇదే సరిపోతుంది.

వీరయ్యలోని మరో పెద్ద వైఫల్యం ఏమిటంటే.. ఇంటర్వెల్ వరకూ కథ, పాత్రల లక్ష్యం ఏమిటో అర్ధం కాదు. ప్రేక్షకుడికి కూడా తెరపై చిరంజీవి కనిపిస్తున్నాడనే ఒక్క కారణం తప్పా.. మరో కారణం వుండదు సినిమా చూడటానికి. ఓ భారీ ఫైట్ తో పూనకాలు లోడింగ్ అంటూ ఇంటర్వెల్ పడుతుంది. ఇప్పటి వరకూ ఏం చూశామని ప్రేక్షకుడిలో ఓ అనుమానం వుంటుంది. ఆ అనుమానం కూడా నివృత్తి చేస్తూ.. ‘ సీతాపతి కథ పూర్తయింది. ఇకపై నా కథ మొదలౌతుంది” అంటాడు వీరయ్య. ఓహో.. ఇప్పటి వరకూ కథ స్టార్ట్ కాలేదా ? పోనీ సెకండ్ హాఫ్ లో వుంటుందిలే అని మళ్ళీ సీట్లు కూర్చున్న ప్రేక్షకుడికి ఇంకో షాక్ తగులుతుంది.

విక్రమ్ సాగర్ రవితేజ ఎంట్రీ.. ఆయన కూడా హీరో కాబట్టి.. ఒక ఎలివేషన్ ఫైటు.. పాట ఇచ్చారు. ఎప్పుడైతే.. వీరయ్య, కాలా, విక్రమ్ సాగర్ కలిశారో.. వాళ్ళ మధ్య రెండు సీన్లు వచ్చాయో.. వీరయ్య క్లైమాక్స్ అర్ధమైపోతుంది. ఇలాంటి కథని చూపించడానికి చిరంజీవి, రవితేజ లాంటి హీరోలు అవసరమా ? అనిపిస్తుంది. చిరంజీవి, రవితేజ మధ్య సెంటిమెంట్ పండిపొతే సినిమా వేరే లెవల్ కి వెళ్ళిపోతుందని ఎక్కువగా ఊహించుకున్నాడు దర్శకుడు. సెంటిమెంట్ పండటానికి వాళ్ళ మధ్య బాండింగ్ వుండాలి.అసలు ఈ కథలో లేనిదే అది. ఎలివేషన్స్ మీద ద్రుష్టిపెట్టుకుంటూ వెళ్ళిన దర్శకుడు కథ కథనాలని హీరోల ఇమేజ్ మీద వదిలేశాడు. ఇందులో ప్లస్ పాయింట్స్ లేవా అంటే వున్నాయి. చిరంజీవి హుషారుగా కనిపిస్తారు. కొన్ని కామెడీ సీన్లలో తనదైన టైమింగ్ చూపించారు. రవితేజ ఎంట్రీ పూనకాలు లోడింగ్ పాట ఫ్యాన్స్ కి నచ్చుతుంది. జై లవకుశ టైపు లో డిజైన్ చేసిన ఒక యాక్షన్ ఎపిసోడ్ బావుంటుంది. ఫస్ట్ హాఫ్ లో అసలు కథలోకి వెళ్ళని దర్శకుడు.. సెకండ్ హాఫ్ లో కూడా అనవసరమైన హంగులపై ద్రుష్టి పెట్టి.. ఎమోషన్ మొత్తాన్ని నీరు కార్చేశాడు. చివర్లో కోర్టు లో వాదనలు అయితే మరీ సిల్లీగా వుంటాయి.

చిరంజీవి లుక్ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తుకు తెస్తుంది. కథలో చెప్పడానికి ఏమీ లేకపోయినా చిరు స్టయిల్, గ్రేస్ ఎండ్ కార్డ్ వరకూ చూసేలా చేశాయి. రవితేజ లుక్ బావుంది. హుషారుగా చేశాడు. ఎమోషన్ సీన్స్ ఇంకా బలంగా డిజైన్ చేయాల్సింది. వీరి తర్వాత చెప్పడానికి ఇందులో మరో బలమైన పాత్ర లేదు. ప్రకాష్ రాజ్ రొటీన్ విలన్ గా కనిపించారు. శ్రుతి హాసన్ పాత్ర విచిత్రంగా వుంటుంది. ఆమె రా ఏజెంట్.. తను వెదుకుతున్న గ్యాంగ్ స్టార్ పాయింట్ బ్లాంక్ లో దొరికినా… హీరో చూసుకుంటాడులే అనే టైపు పాత్ర. పాటలకే పరిమితమైయింది. కేథరిన్ పాత్ర చిన్నదే. రాజేంద్ర ప్రసాద్ పాత్రలో బలం లేదు. చాలా పెద్ద కామెడీ గ్యాంగ్ వుంది కానీ ఇందులో కామెడీ లేదు. చివరికి చిరంజీవి ని కూడా జబర్దస్త్ టైపు లో జంబలకిడి జారు మిఠాయి, న్యూస్ రీడర్ వైరల్ వీడియో కంటెంట్ తో ఇమిటేట్ చేయించడం చూస్తే దర్శకుడికి చిరంజీవి పై వున్న అభిమానం ఎలాంటి ఏమిటో అర్ధం కాదు. చిరంజీవికి అభిమాని అంటే ఆయన చేసిన సినిమా సినిమాలు, మూమెంట్స్ వాడుకోవడం కాదు .. అభిమానిగా తను ఎదో కొత్తది చేసి చూపించాలి.. అంతేకాని.. ఒక ట్రెండ్ సెట్టర్ లాంటి మెగాస్టార్ ని తీసుకొని ఆయనతో జంబలకిడి జారు మిఠాయి అనిపించడం.. మెగా అభిమానులకు కూడా రుచించదు.

పాటలు బావున్నాయి కానీ ప్లేస్ మెంట్ కుదరలేదు. మంచు తీసిన పాటకి ఆ ట్యూన్ కి సంబంధం లేదు. నేపధ్య సంగీతం తేలిపోయింది. ఆర్థర్ విల్సన్ కెమరాపనితనం బావుంది. నిర్మాతలు రాజీపడలేదు. డైలాగ్స్ లో పసలేదు. ట్రైలర్ లో వినిపించిన డైలాగులే తప్పా.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఒక్క డైలాగు లేదు. ఒక అభిమాని సినిమా తీస్తే ఏ స్థాయిలో వుంటుందనే చాలా మంది అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయంలో చాలా నిశారపరిచాడు బాబీ. పైగా చివర్లో ”ప్రతి ఇంటికి ఇలాంటి అన్నయ్య ఒకడు వుండాలి’ అంటూ డైరెక్టర్ నోట్ ఇస్తాడు. అది చూస్తున్నపుడు.. చిరంజీవి లాంటి అన్నయ్య వుండాలని అంటున్నాడా? తను చెప్పిన కథలో వీరయ్య లాంటి అన్నయ్య వుండాలని చెబుతున్నాడా ? అనే అనుమానం వస్తుందంటే.. వీరయ్య ఎమోషన్ ని ఎంత బలహీనంగా డీల్ చేశాడో అర్ధం చేసుకోవచ్చు.

బాబీ ఈ కథ చెబుతున్నపుడు.. ”ఇందులో కథ లేదు బాబీ’ అని చిరంజీవి ముందే చెప్పారని బాబీ ఒక సందర్భంలో చెప్పాడు. తర్వాత కథ రెడీ చేసుకొని వెళ్ళాడట. ఇందులో బాబీ కథ రెడీ చేయడం అబద్దం అనిపిస్తుంది. సినిమా మొత్తం చూశాక.

ఫినిషింగ్ టచ్ : నీరసాలు లోడింగ్..

తెలుగు360 రేటింగ్ : 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close