పాకిస్తాన్‌పట్ల భారత దేశం ప్రతిస్పందన తదుపరి చర్య ఎలా వుంటాయని ప్రపంచం ఎదురు చూస్తున్నది. ఎందుకంటే కాశ్మీర్ లోయలోని బారముల్లా జిల్లా ఉరి గ్రామంలో సైనిక కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేసి 17మందిని బలిగొనడాన్ని ఖండిస్తున్నది. ఇందుకు పాక్ ప్రేరిత ఉగ్రవాదులు కారణమని ప్రభుత్వం ప్రకటన చేసింది.ఆ దేశం ప్రవర్తన ఎప్పుడూ అలాగే వుంది గనక అయినా కావచ్చు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ అద్యక్షతన ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష జరిగింది.
సరిహద్దులు దాటి వెళ్లి దాడి చేయడంతో సహా రకరకాల అవకాశాలు పరిశీలిస్త్నున్నట్టు ప్రకటించారు.కాని దేశం గురించి భద్రత గురించి అదేపనిగా మాట్లాడేవారు సైనిక కేంద్రాలపైనే దాడులు జరిగే పరిస్థితిని ఎలా అనుమతిస్తున్నారు? నిఘా ఎందుకు పెంచడం లేదు? ఈ విషయమై ముందే వచ్చే నిఘా నివేదికలను నిర్లక్ష్యం చేయడానికి కారణమేమిటి? ఉరి దాడి విషయంలోనైతే లెఫ్టినెంట్ జనలర్ అటా హుస్సేన్ పదిరోజులు కిందటసెప్టెంబరు 8నే ఈ కేంద్రంపైనే దాడి జరుగుతుందని హెచ్చరించినా అప్రమత్తత లేకపోవడం ఎవరి తప్పు?కార్గిల్ ఘర్షణ కూడా చొరబాట్లు కనుక్కోలేకపోయిన ఫలితమే. ఆ ఘర్షణ తర్వాత యుద్ధం వాజ్‌పేయి మరోసారి గెలవడానికి(నిజానికి అదే పూర్తికాలం ప్రభుత్వం) దోహదం చేసిందని ప్రతివారూ ఒప్పుకుంటారు. ఇప్పుడు కూడా నిఘాను నిర్లక్ష్యం చేయడం, తర్వాత సరిహద్దులు దాటి వెళ్లి యుద్ధం చేస్తామని స్థావరాలు నాశనం చేస్తామని సంకేతాలివ్వడం రాజకీయ లబ్దికి దోహదపడొచ్చు గాని దేశ భద్రతకు ఏం మేలు చేసేట్టు? అణుదేశాలుగా వున్న భారత పాక్‌లు అంత తేలిగ్గా దాడులు చేసుకోలేవని రాజనీతి యుద్ధనీతి తెలిసిన వారంతాచెప్పగలరు.
బక్రీద్ పండుగ రోజు కూడా కర్ప్యూలో వుండాల్సినస్థితి కాశ్మీర్లో పెట్టుకుని దేశ భద్రత గురించి రక్షణ గురించి చెప్పుకోవడం నిరర్థకం.ఇప్పటికైనా అక్కడ శాంతి స్థాపనకు అందరితో చర్చించాలి. నిఘాను ఆత్మరక్షణ వ్యవస్థను పటిష్టం చేసి చొరబాట్లను దాడులను అడ్డుకోవాలి. లేదంటే వీర సైనికులు బలవుతుంటారు, నేతలు గొప్పలు చెబుతుంటారు. స్వచ్చ భారత్ పేరిట శుష్క ప్రచారాలకన్నాభద్ర భారత్ గురించి ఆలోచించడం ముందు జరగాలి. కాశ్మీర్లోయలోనూ పరిస్థితి సరిగ్గా లేదు గనక అక్కడ చిచ్చు పెట్టే ఉగ్రవాద శక్తులు ఈ పనిచేసి వుండొచ్చనీ అనుమానాలున్నాయి.ఏది ఏమైనా 2002లో కొల్చర్ సైనిక కేంద్రంపై దాడిలో 31 మంది మరణించిన తర్వాత ఇంత పెద్ద దాడి దారుణ హత్యాకాండ చూళ్లేదు. 2014 డిసెంబరులో ఇదే ఉరి దగ్గర ఉగ్రవాద దాడిలో ఎనిమిది మంది మరణించారు. గత ఏడాది పఠాన్‌కోట వైమానిక స్థావరంలోకి ఉగ్రవాదులు చొరబడిన దుర్మార్గం సంచలనం కలిగించింది. వీటన్నిటినీ దేశం ఒక్క కంఠంతో ఖండించింది. అయితే ఈ దాడులకు ముందూ తర్వాత బిజెపి ప్రభుత్వం ప్రతిస్పందించే తీరు మాత్రం వివాదాస్పదంగా వుందని చెప్పకతప్పదు.