అవినీతి పరులను అందరూ తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి వాళ్ళ టాలెంట్ చూస్తూ ఉంటే అద్భుతమనిపిస్తుంది. ఒక్క అవినీతిపరులు అనే కాదు… బిన్ లాడెన్, వీరప్పన్, టెర్రరిస్ట్‌ల తెలివితేటలు కూడా ఒక్కోసారి మనల్ని ఆశ్ఛర్యపరుస్తూ ఉంటాయి.
గాలి జనార్ధన్ రెడ్డి….చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో దోస్తీ చేసి బాగానే సంపాదించుకున్నారు. ఆ తర్వాత వైఎస్వారు అధికారంలోకి రాగానే ఆయనకు అనుంగు సోదరుడయ్యాడు. వైఎస్ జగన్‌కి దేవుడిచ్చిన బాబాయ్ అయ్యారు. బిజెపి అగ్రనేత సుష్మా స్వరాజ్‌కి కూడా మనవాడు ఆత్మ బంధువేనండోయ్. ఆ కాలంలో బంగారు సింహాసనాలు, హెలికాప్టర్లు, నైజాం ప్రభువులను తలదన్నే స్థాయి బంగళాలు….అబ్బో గాలిగారి ఆనాటి వైభోగం గురించి చెప్పాలంటే… ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కవులు తిరిగిరావాలి. అంతా కూడా రాజవైభోగమే. కానీ ఒక్కసారి దొంగతనం బయటపడ్డ తర్వాత మాత్రం అంతా తల్లకిందులైంది. ఆత్మబంధువు సుష్మాస్వరాజ్గారు ఛీ..పో….అని చీదరించుకున్నారు. అబ్బాయి జగన్ కూడా…ఆయనతో నాకేటి సంబంధం అన్నాడు. తనను వదిలి… వైఎస్ ఇంటి మనిషైనప్పుడే చీ కొట్టిన చంద్రబాబు స్పందన గురించి చెప్పేదేముంది? దాంతో రాజకీయ అనాథగా మిగిలిపోయాడు.
అప్పట్లో చాలా మంది జనాలు గాలి జనార్ధన్‌రెడ్డికి ఉరిశిక్ష ఖాయం అనే రేంజ్లో వార్తలు రాసేశారు కానీ ఓ జయలలిత, ఓ లాలూ ప్రసాద్ యాదవ్, ఓ సల్మాన్ ఖాన్….ఇంకా బోలెడు మంది బడాబాబుల కేసుల్లాగే గాలిగారి కేసు కూడా సాగడం స్టార్ట్ అయింది. ఇప్పుడిక కేసుల నుంచి దిగ్విజయంగా బయటపడాలంటే మళ్ళీ రాజకీయ పార్టీలతో బంధుత్వం చేయాలి. ఆ తర్వాత పదవులను అలంకరించాలి. అంటే పోయిన గాలిని మళ్ళీ తెచ్చుకోవాలి. అందుకోసం తన ఇంటి పెళ్ళిని ఆయుధంగా వాడడానికి రెడీ అయ్యాడు గాలి జనార్ధనరెడ్డి. అదేదో సినిమాలో చెప్పినట్టు….వెంకన్నబాబు ఫొటో ముందు నిలబడి కూడా మూడుముళ్ళేసుకుని పెళ్ళయిపోయిందనిపించుకోవచ్చు. కానీ అవినీతి, అక్రమాలు ఎన్నో చేసి…. ఉన్న గాలిని పోగొట్టుకున్న డబ్బున్న మారాజులందరూ కూడా ఇలాంటి పెళ్ళిళ్ళ కోసం పెట్టిన డబ్బుతోనే మళ్ళీ పోగొట్టుకున్న గాలిని తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పెళ్ళిని కూడా దేశం మొత్తం కూడా చెప్పుకునేంత ఘనంగా…ధన బలంతో చేయాలన్నమాట. ఈ మధ్య వెంకయ్యనాయుడుగారు డబ్బు పాచిపోదు అని మా బాగా సెలవిచ్చారు కానీ… ఇండియాలో డబ్బు పాచిపోదు, నల్లబడిపోదు, అవినీతి చెదలు అంటదు, అక్రమమూ కాదు…. కాకపోతే మన దగ్గర అధికార బలం ఉండాలి అంతే. ఇప్పుడు గాలిగారి వ్యూహం కూడా అదే. మరి వచ్చే ఎన్నికలలోపు గాలిగారితో బంధుత్వం కలుపుకోబోయే…..ఈ గాలిగారి శుభ(?) కార్యానికి ఎగేసుకుని ఎళ్ళిపోయే, డబ్బు చుట్టూ తిరిగే ఆ ఆత్మబంధువులు ఎవరో తెలియాలి. ఇక మన గాలిగారికి, ఆయన కొత్తా బంధువులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి సమాధానం చెప్తారో కూడా చూడాలి మరి.