ఈవారం కూడా బాక్సాఫీసు దగ్గర సందడి కనిపించబోతోంది. బడా సినిమాల హడావుడి లేకపోయినా… చిన్న సినిమాలు మాత్రం పుష్కలంగా రాబోతున్నాయి. ఈవారం 4 సినిమాలు క్యూలో ఉన్నాయి. అవన్నీ వివిధ జోనర్లకు సంబంధించినవి. ప్రేమంటే, రాజు వెడ్స్ రాంబాయి, 12 ఏ రైల్వే కాలనీ, పాంచ్ మినార్ ఈ వారం చూడబోతున్న సినిమాల లిస్టు.
నరేష్ నటించిన సినిమా ’12 ఏ రైల్వే కాలనీ’. ఇదో థ్రిల్లర్. `పొలిమేర` లాంటి సినిమాల్ని అందించిన అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షో రన్నర్. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. థ్రిల్లర్ తరహా కథలకు మంచి సీజన్ నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగానే ఉన్నారు. నరేష్ ఈమధ్య జోనర్లు బాగా షిఫ్ట్ చేస్తున్నాడు. ఈ జోనర్ తనకెంత లక్ తీసుకొస్తుందో చూడాలి.
ప్రియదర్శి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ‘మిత్రమండలి’ వచ్చింది. ఆ సినిమా ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయింది. ఇప్పుడు ‘ప్రేమంటే’ రూపంలో మరో ప్రయత్నం చేస్తున్నాడు. టైటిల్ పరంగా చూస్తే ప్రేమకథలానే అనిపిస్తున్నా, ఇదో పెళ్లి కథ. విడాకుల కథ. థ్రిల్ పంచే.. కథ. ఆనంది హీరోయిన్ గా నటించింది. సుమ ఓ కీలక పాత్ర పోషించింది. ఈసారి హిట్టు కొట్టడం ఖాయం అంటూ.. ప్రియదర్శి కూడా ఈసినిమా గురించి గట్టిగానే చెబుతున్నాడు.
ఈటీవీ విన్ ఈమధ్య కంటెంట్ ఉన్న సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆ సంస్థ నుంచి వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ సూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు మరో లవ్ స్టోరీ చూపించబోతోంది. అదే.. ‘రాజు వెడ్స్ రాంబాయి’. విరాటపర్వం లాంటి మంచి సినిమా అందించిన వేణు ఉడుగుల ఈ చిత్రానికి షో రన్నర్. ఈ ప్రేమకథలో క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించలేరని ఆయన గట్టిగా చెబుతున్నారు. వీటితో పాటు రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘పాంచ్ మినార్’ కూడా ఈవారమే వస్తోంది.ఇదో క్రైమ్ థ్రిల్లర్. రాజ్ తరుణ్ ఈమధ్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ సక్సెస్ రావడం లేదు. ఈసారి కూడా అదే జరిగితే తన కెరీర్‌కు శుభం కార్డు పడినట్టే.


