పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన కాంగ్రెస్, కమ్యూనిస్టుల పరిస్థితి ఇప్పుడు ఒంటరి పోరాటంగా మారిపోయింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, బెంగాల్ గడ్డపై మాత్రం ఒకరినొకరు భారంగా భావించుకునే పరిస్థితి వచ్చింది. నామినేషన్లు ప్రారంభమవుతున్న సమయంలో కాంగ్రెస్ తీసుకున్న ఒంటరి నిర్ణయం విపక్షాల ఐక్యతపై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.
మిత్రపక్షాల మధ్య పెరిగిన దూరం
పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ , సిపిఎం మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న ఎన్నికల అవగాహనకు ఇప్పుడు తెరపడింది. 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసి నడిచిన ఈ రెండు శక్తులు.. ఇప్పుడు ఒకరినొకరు నమ్మలేని స్థితికి చేరుకున్నాయి. 2026 ఎన్నికల్లో మొత్తం 294 స్థానాల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం వెనుక తమ ఉనికిని కాపాడుకోవాలనే తపన కంటే, మిత్రపక్షం వల్ల తమకు ఒరిగేదేమీ లేదనే నిస్పృహే ఎక్కువగా కనిపిస్తోంది.
ఆశల్లేని చోట.. విడివిడి పోరాటం
2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది . కేవలం ఒక సీటును వారి మిత్రపక్షం ISF గెలిచింది. మల్దా, ముర్షిదాబాద్ వంటి కాంగ్రెస్ కంచుకోటలు కూడా తృణమూల్ వశమయ్యాయి. కలిసి పోటీ చేసినా ఓడిపోతున్నప్పుడు విడివిడిగా పోటీ చేసి తమ పార్టీ క్యాడర్‌ను పునర్నిర్మించుకోవడమే మేలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి లేని చోట కూడా మిత్రపక్షాలతో కలవకపోవడం ఆ పార్టీ జాతీయ స్థాయి కూటమి ధర్మాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.
రాహుల్ గాంధీ వ్యూహం – రిస్క్ పాలిటిక్స్?
నిజానికి మమతా బెనర్జీ కూడాఇండీ కూటమిలో భాగమే. కానీ ఎప్పుడూ అలా ఉండరు. బీజేపీకి వ్యతిరేకం. అందుకే కాంగ్రెస్ కూడా ఒంటరిగానే మిగులుతోంది. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా పోరాడితేనే మన సత్తా తెలుస్తుంది అనే లైన్‌ను కాంగ్రెస్ ఎంచుకుంది. కానీ, ఇప్పటికే టీఎంసీ, బీజేపీల మధ్య ద్వైపాక్షిక పోరుగా మారిన బెంగాల్లో కాంగ్రెస్ ఒంటరి పోరాటం ఓట్ల చీలిక కు మాత్రమే పరిమితమవుతుంది. కాంగ్రెస్ నిర్ణయంపై లెఫ్ట్ ఫ్రంట్ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ తమకు భారంగా మారిందని కొందరు కమ్యూనిస్టు నేతలు ప్రకటించారు. అందుకే వదిలేశామన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతామని చెప్పే ఈ పార్టీలు, బెంగాల్లో మాత్రం కత్తులు దూసుకోవడం ఇండియా కూటమి లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. ఇది కేవలం బెంగాల్‌కే పరిమితం కాకుండా, ఇతర రాష్ట్రాల్లోనూ కూటమి మనుగడపై ప్రభావం చూపే అవకాశం ఉంది.