ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని వణికించి, ప్రత్యర్థులను భయపెట్టిన వెస్టిండీస్ జట్టు… నేడు వరుస పరాజయాలతో, ఆత్మవిశ్వాసం కోల్పోయి, నిస్సహాయంగా తలవంచిన జట్టుగా మారిపోయింది. భారత్ తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌లోనూ అదే దృశ్యం పునరావృతం అయ్యింది టీమ్ఇండియా ముందు కరేబియన్ జట్టు పూర్తిగా మట్టికరిచింది. ఒక ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.
ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే ఇండియా 448/5 వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, వెస్టిండీస్ ముందుకు 286 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఆ లక్ష్యాన్ని చేధించే ప్రయత్నం చేసిన కరేబియన్ బ్యాటర్లు మరోసారి బలహీనత చాటుకున్నారు. 146 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
కరేబియన్ బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఇది వారి పేలవ ప్రదర్శనకు ప్రతిబింబం. వెస్టిండీస్ క్రికెట్ ఏ స్థాయికి పడిపోయిందో ఈ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. వరల్డ్‌కప్‌లు గెలుచుకున్న, మహా బౌలర్లను, విధ్వంసకర బ్యాటర్లను అందించిన జట్టు… నేడు మూడో రోజుకే చేతులెత్తేసే స్థితికి చేరుకోవడం భాదాకరం.