పార్ట్ 2 అంటే ఏమిటో, ఎలా ఉండాలో ప్రాక్టికల్ గా చూపించాడు ఆదిత్య ధార్. ‘దురంధర్’, ‘దురంధర్ 2’ కి మధ్య గ్యాప్ 3 నెలలే గ్యాప్ ఇచ్చాడు. ‘దురంధర్’ డిసెంబరు 5న విడుదలైంది. ‘దురంధర్ 2’ ఈనెల 18న వచ్చింది. ‘దురంధర్’ ఓటీటీలో వచ్చి, ఆ సినిమా గురించి విపరీతంగా చర్చించుకొంటున్న దశలోనే ‘దురంధర్ 2’ ప్రచారాన్ని మొదలెట్టేశాడు. ‘దురంధర్’ మూడ్ లో ఉన్నప్పుడు పార్ట్ 2 కూడా దించేశాడు. దాంతో క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ‘దురంధర్’ మించిన వసూళ్లు పార్ట్ 2 రాబడుతోంది. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే… నార్త్ తో పాటు సౌత్ లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి.
పార్ట్ 2 పేరుతో ఆ ప్రాజెక్టుని ఏళ్లకు ఏళ్లు నానబెడుతున్న సమయంలో పార్ట్ 2 అనేది ఎలా తీయాలో చెప్పిన దర్శకుడు ఆదిత్య ధార్. ఈ విషయంలో ఆదిత్య ధార్ అడుగుజాడల్లో మిగిలిన దర్శకులు నడవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎప్పుడైతే పార్ట్ 2 హిట్టయ్యిందో అప్పుడే పార్ట్ 3 గురించి ఆశలు, ఆలోచనలు రేగుతున్నాయి. పార్ట్ 2 హిట్టయిన వెంటనే ఏ దర్శకుడైనా పార్ట్ 3 ఉంటుంది అని ఎనౌన్స్ చేయొచ్చు. ఆ క్రేజ్ ని వాడుకోవొచ్చు. కానీ ఆదిత్యధార్ అది కూడా చేయలేదు. ‘పార్ట్ 3 ఉండదు’ అని కుండబద్దలు కొట్టేశాడు. దానికి బదులుగా కొత్త కథలపై వర్క్ చేసుకోవొచ్చు అనేది తన ఆలోచన. దురంధర్ పార్ట్ 3కి స్కోప్ కూడా ఉంది. దావూద్ ఇబ్రహీం పాత్రని అడ్డు పెట్టుకొని పార్ట్ 3 లాగించేయొచ్చు. కానీ ఆదిత్యధార్ ఆ పాత్రని మంచానికే పరిమితం చేయడానికి ఇష్టపడ్డాడు. సో.. పార్ట్ 3పై వస్తున్నవన్నీ జస్ట్ ఊహాగానాలే. కాకపోతే ఆదిత్యధార్ తదుపరి ప్రాజెక్టులపై ఈ దురంధర్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. అభిమానుల అంచనాలు పెరిగిపోతాయి. వాటిని రీచ్ అవ్వడానికి ఆదిత్య చాలా కష్టపడాల్సివస్తుంది. రణవీర్ సింగ్ పై కూడా ‘హంజా’ పాత్ర ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఆ హ్యాంగోవర్ నుంచి బయటకు వచ్చి, కొత్త పాత్ర చేసి మెప్పించడం తనకు కూడా కష్టమే. ఈసారి కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయాలంటే ఇంకా బలమైన పాత్రలు పట్టుకోవాలి. అలాంటి క్యారెక్టర్స్ రాసే దర్శకుల్ని వెదికి పట్టుకోవడం రణవీర్ కి సవాలే.
