ఈ ట్విట్టర్ కు ఏమైంది ?

ఉన్నట్టుండి మొరాయించింది. రాత్రి పోస్ట్ చేసిన ఆర్టికల్ కు స్పందన ఎలా ఉందో చూద్దామంటే ట్విట్టర్ లో ఖాతా తెరుచుకోలేదు. దీంతో మూడ్ ఆఫ్ అయిపోయిందంటూ లండన్ లోని ఒక రచయిత్రి తెగ ఫీలైపోయింది. ఒక్క లండన్ లోనేకాదు, స్విట్జర్లాండ్, న్యూయార్క్ ఇలా అనేక చోట్ల ట్విట్టర్ తలుపులు మూసుకుని కూర్చుంది. ఆరాతీస్తే ఎక్కడో ఏదో టెక్నికల్ ఫాల్ట్ ఉన్నట్లు తేలింది. అనేక దేశాల్లో ట్విట్టర్ డౌన్ అయిపోవడంతో దీంతో కాలక్షేపం సాగించే కోట్లాది మంది ముఖం ముడుచుకోవాల్సివచ్చింది. పదేళ్ల ట్విట్టర్ చరిత్రలో ఇంతలా ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారట.

అమెరికాతో పాటుగా యూరప్ దేశాల్లోనూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, నైజీరియా, ఉగాండ దేశాల్లో కూడా ట్విట్టర్ తన ఖాతాదారులను చాలాసేపు విసిగించింది. పారిస్, లండన్ వాసులనైతే మంగళవారం మధ్యాహ్నం వరకు మధ్యమధ్యలో ట్విట్టర్ సేవలు అందలేదు. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకి అందిన సమాచారం ప్రకారం రష్యాలో ఇంకా ట్విట్టర్ ఇబ్బందులు పెడుతూనే ఉన్నదట.

`ట్విట్టర్ డౌన్’ మీద బ్రిటీష్ టివీ ఛానెల్ E4 తన ఫేస్ బుక్ పేజీలో ఒక జోకు కూడా పేల్చింది. `ట్విట్టర్ డౌన్ అయింది, దీంతో ఉద్యోగుల్లో పనితీరు రికార్డ్ స్థాయిలో మెరుగైంది. యుకెలో ఆర్థిమాంద్యం అవుట్ అయిందం’టూ జోకేసింది.

సామాజిక మాధ్యమంగా ట్విట్టర్ 2006లో అవతరించింది. సడన్ గా ట్విట్టర్ తెరుచుకోకపోవడం ఇప్పుడేమీ కొత్తకాదు. మధ్యమధ్యలో పడకేస్తూనే ఉంది. అయితే ఈసారి ఎక్కువ సేపు మొరాయించింది. ఆమాట కొస్తే ట్విట్టర్ కు గట్టిపోటీ ఇస్తున్న ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సైతం మధ్యమధ్యలో మొరాయించినవే. 2012లో ట్విట్టర్ ప్రియులకు రెండుగంటలపాటు సేవలు లభించలేదు. డేటా సెంటర్స్ లో సమస్య ఉత్పన్నం కావడంతో ఇలా జరిగిందట. ఈసారి కూడా ఏదో సాంకేతిక కారణమనే అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్ నాలుగవ స్థానంలో ఉంది. ప్రపంచమంతటా దాదాపు 35 కోట్ల మంది ఖాతాదారులుగా ఉన్నారు. అయితే ఫేస్ బుక్ ఈ స్థాయిని ఎప్పుడో దాటిపోయింది. ఫేస్ బుక్ యూజర్స్ సంఖ్య 1.5 బిలియన్లు. లింకెడిన్ , ఇన్ స్టాగ్రామ్ లు కూడా ట్విట్టర్ ను దాటేశాయి. మరో పక్క స్నాప్ చాట్ శరవేగంతో దూసుకుపోతూ 10కోట్లకు తన ఖాతాదారుల సంఖ్యను పెంచుకుంది. ట్విట్టర్ లో కొత్తదనం తగ్గిపోవడం ఆదరణ పడిపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇప్పటికీ 140 కారెక్టర్ ట్వీట్ తోనే ఖాతాదారులు సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. దీన్ని పదివేల కారెక్టర్స్ కు పెంచాలని అనుకుంటున్నారు. మార్చి నుంచి ఈ అవకాశం అందుబాటులోకి రావచ్చు. అయితే ఇదేమీ నెట్ జెన్లను సంతృప్తి పరుస్తున్నట్లులేదు. దీనిపై మిశ్రమ స్పందన వస్తున్నది. వినియోగదారులను సంతృప్తి పరచడం కోసం ట్విట్టర్ ఏదో చేయాలి. కానీ ఏం చేయాలో ఆ సంస్థకే ఇంతవరకు సరైన అవగాహన రాలేదు. వీటన్నింటికీ తోడు మధ్యమధ్యలో మెరాయింపులొకటి. మరి ట్విట్టర్ యాజమాన్యం ఏమేరకు స్పందిస్తుందో చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com