హైదరాబాద్ యూనివర్సిటీకి ఐదు లేఖలు వ్రాసిన కేంద్రం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిణామాల గురించి ఆసక్తి కరమయిన విషయాలు ఒక్కొక్కటి మెల్లగా బయటపడుతున్నాయి. ఆ యూనివర్సిటిలో రోహిత్ వర్గానికి చెందిన అంబేద్కర్ విద్యార్ధి సంఘం, బీజేపీకి చెందిన ఎబివిపి విద్యార్ధి సంఘం మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ముంబై బాంబు ప్రేలుళ్ళ సూత్రధారి యాకూబ్ మీమన్ ఉరి తీస్తున్నపుడు అంబేద్కర్ విద్యార్ధి సంఘం అందుకు నిరసనలు తెలియజేసినప్పటి నుంచి ఆ రెండు విద్యార్ధి సంఘాల మధ్య ఘర్షణలు పెరిగాయి. ఎబివిపి విద్యార్ధి సంఘం పిర్యాదు మేరకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ గత ఏడాది ఆగస్ట్ 17న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రికి యూనివర్సిటీలో పరిస్థితులను వివరిస్తూ ఒక లేఖ వ్రాసారు. యూనివర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దవలసిందిగా ఆయన తన లేఖలో కోరారు.

ఆయన లేఖపై స్పందించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ యూనివర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దమని ఆదేశిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కి సెప్టెంబర్ 3, 24 తేదీలలోఈ-మెయిల్ ద్వారా రెండు లేఖలు పంపింది. ఆ లేఖలలో ఎబివిపి విద్యార్ధి సంఘం అధ్యక్షుడు నందనం సుషీల్ కుమార్ (పి.హెచ్.డి విద్యార్ధి)పై జరిగిన దాడి గురించి ప్రస్తావించి తక్షణమే అందుకు బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించింది. ఆ తరువాత వరుసగా మరో మూడు ఈ-మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. అందుకే యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అప్పారావు రోహిత్ వర్గానికి చెందిన విద్యార్ధులను సస్పెండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు ముందు రోజు కూడా ఆ రెండు విద్యార్ధి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది.

దాదాపు అన్ని యూనివర్సిటీలలో విద్యార్ధుల మధ్య ఈ కుల, మత, ప్రాంతీయ విభేదాలు చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్ధులలో ఈ కులపిచ్చి చాలా ప్రబలిపోయింది. నాగార్జున యూనివర్సిటీలో అయితే కులాలవారిగా బోర్డులు కూడా ఏర్పాటుచేసుకొన్న సంగతి అందరికీ తెలుసు. విద్యార్ధులకు మార్గ నిర్దేశం చేయవలసిన ఆచార్యులలో కొందరు వారికి ఈ కులగజ్జి అంటించి పెంచి పోషిస్తున్నారు. ఇవి సరిపోవన్నట్లు రాజకీయ పార్టీలకు అనుబంధంగా విద్యార్దీ సంఘాలు కూడా ఉండటంతో చదువులపై దృష్టి పెట్టవలసిన విద్యార్ధులు కుల,మత రాజకీయాలపై ఆసక్తి పెంచుకొంటున్నారు. ఎప్పుడయినా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొన్నప్పుడు యూనివర్సిటీలో నెలకొన్న ఈ సమస్యలన్నీ బయటకి పొక్కుతుంటాయి. పరిస్థితులు సద్దుమణగగానే మళ్ళీ అన్నీ యధాప్రకారం సాగుతూనే ఉంటాయి.

ఈ కుల,మత రాజకీయాలకు ఉజ్వల భవిష్యత్ గల విద్యార్ధులు బలయిపోతునే ఉన్నారు. కనుక యూనివర్సిటీల నుంచి ఈ కుల,మత, రాజకీయాలను పూర్తిగా తొలగించి ప్రక్షాళన చేయనంత వరకు ఇటువంటి సమస్యలు పునరావృతం అవుతూనే ఉండవచ్చును. కానీ రాజకీయపార్టీలు విద్యార్ధులను విడిచిపెట్టడానికి అంగీకరించబోవు కనుక ఈ సమస్య బహుశః ఎన్నటికీ పరిష్కారం అయ్యే అవకాశం కూడా లేదనే భావించవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com