ఇప్పుడు ఇల్లు అంటే యాభై, అరవై లక్షలు బిల్డప్ కు కట్టేసి అపార్టుమెంట్ కొనేసి గృహప్రవేశం చేసేలా ఉండటం లేదు. ఇల్లు అంటే పూర్తిగా మొండిగోడలు, గుమ్మాలతో మాత్రమే వస్తుంది. మిగతా అంతా కొనుగోలుదారులు.. తమ అభిరుచి మేరకు లోపల ఇంటీరియర్ చేయించుకోవాలి. ఇది అదనపు ఖర్చు. లగ్జరీ ఫ్లాట్స్ లోనే కాదు.. సాధారణ అపార్టుమెంట్లలోనూ ఇప్పుడు ఈ ట్రెండ్ కనిపిస్తోంది.
ఇంటీరియర్స్ అంటే ఖర్చు సింపుల్ గా అయిపోయేది కాదు. గతంలో షెల్ఫ్‌లకు తలుపులు పెట్టించుకుంటే అది ఇంటీరియర్ అయ్యేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ప్రత్యేకంగా ప్రతి ఇంటిని డిజైన్ చేయించుకుంటున్నారు. క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారు. లేకపోతే నిర్వహణ సమస్యలు వస్తాయి. త్వరగా పాడైపోతే లక్షల్లో నష్టం వస్తుంది. ఈ ట్రెండ్ పెరుగుతుంది కాబట్టే… స్టార్టప్‌లు కూడా పుట్టుకొచ్చాయి. హోమ్ లేన్ ,లైవ్ స్పేస్ వంటి సంస్థలు ఇంటీరియర్ సేవలు అందిస్తున్నాయి. మధ్యవర్తులతో ఒప్పందాలు చేసుకుని నో బ్రోకర్ వంటివి కూడా చేయిస్తున్నాయి.
ఇంటీరియర్‌కు ఇలాంటి సంస్థలన్నీ ఇంజినీర్డ్ ఉడ్ వాడుతూంటాయి. కానీ ప్లైఉడ్ వాడితేనే మన్నిక ఎక్కువగా ఉంటుంది. సాధారణ మధ్యతరగతి ఇళ్లకు ప్లేఉడ్ తో చేయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మంచి లుక్ తో ఉండేలా డబుల్ బెడ్ రూం ఇంటిని కార్పెంటర్ మేస్త్రీలతో చేయించుకుంటే.. కనీసం ఆరు నుంచి పది లక్షల వరకూ అవుతుందని అంచనా. ఇంకా లగ్జరీగా చేయించుకోవాలంటే ఖర్చు అవుతుంది. అంటే ఓ డబుల్ బెడ్ రూం ఫ్లాట్‌కు .. ఆరేడు లక్షలు ఖచ్చితంగా ఇంటీరియర్‌కు అవుతుందన్నమాట. ఇది ఇల్లు కొనే సమయంలో గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం.