భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేయడంతో కవిత పూర్తి స్థాయి జాగృతి నేతగా మారిపోయారు. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినా ఆమోదించకపోయినా ఆ పదవి లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు జాగృతిని బలోపేతం చేసుకునేందుకు కార్యవర్గాన్ని నియమిస్తున్నారు. జిల్లాల వారీగా క్యాడర్ ను రెడీ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆమె జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించలేదు.
జాగృతిలో పదవులన్నింటినీ మైనార్టీలు, గిరిజనులకే కేటాయిస్తున్నారు. ప్రధాన పదవుల్లో వారినే నియమిస్తున్నారు. ఇంత కాలం వారికి ఏ పార్టీలోనూ రాజకీయ ప్రాధాన్యత దక్కడంలేదని అంటున్నారు. అందుకే తాను ప్రాధాన్యం ఇస్తున్నానంటున్నారు. ఇక బీసీల ఎలాగూ ఉద్యమం చేస్తున్నారు. అదే విషయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాను కూడా కాస్త బలంగానే నిర్వహిస్తున్నారు.
ఇదంతా చేస్తున్న కవిత జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించడం మాత్రం మర్చిపోయారు. ముందుగా పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత పార్టీ ప్రకటన చేయాలని ప్లాన్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె సొంత పార్టీ పెట్టుకోవడం, రాజకీయాల్లో కొనసాగడం ఖాయమని అందరికీ స్పష్టత ఉంది. అలాంటప్పుడు మంచి రోజు చూసుకుని పార్టీని ప్రకటించకుండా… కాలమే నిర్ణయిస్తుందని చెప్పడం.. పార్టీని నిర్మించుకోవడం ఎందుకన్న ప్రశ్న వస్తోంది. కానీ కవిత తన రాజకీయం తాను చేస్తున్నారు.