రవిప్రకాష్ అడుగులు ఎటు వైపు..? మరో “టీవీ9” పుడుతుందా..?

రవిప్రకాష్ అంటే టీవీ9 … టీవీ9 అంటే రవిప్రకాష్. ఈ విషయం ఎవరూ కాదనలేరు. ఓ సాధారణ జర్నలిస్టుగా నడక ప్రారంభించి… ఎలక్ట్రానిక్ మీడియా అన్న ఊహే భయంకరంగా ఉన్న సమయంలో.. ముందడుగు వేసి… పెట్టుబడిదారుడిని పట్టుకుని.. నమ్మకం కల్పించి… చానల్‌ను ప్రారంభమయ్యేలా చేయగలగడే ఓ అనితర సాధ్యమైన విషయం. పెద్దగా పెట్టుబడి దన్ను లేని… ఉంటుందో.. ఊడుతుందో తెలియని సంస్థలోకి.. ఉద్యోగుల్ని ఆకర్షించడం.. వారితో.. తనకు కావాల్సిన అవుట్ పుట్ తెచ్చుకోవడం..మరింత గొప్పదనం. ఇలాంటి ఎన్నో చేసి.. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా.. టీవీ9ని… దేశంలోనే ఓ ప్రముఖమైన న్యూస్ బ్రాండ్ గా టీవీ9ని నిలిపారు రవిప్రకాష్. ఇప్పుడా టీవీ9కి రవిప్రకాష్‌కు సంబంధం లేదు. ఆయన మైనార్టీ షేర్ హోల్డర్ మాత్రమే.

తెలుగు టీవీ మీడియాలో చెరగని సంతకం రవిప్రకాష్..!

తెలుగు మీడియాలో రవిప్రకాష్ చేసిన సంతకం ఇప్పుడల్లా చెరిగిపోయేది కాదు. ఆయన ముద్ర ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు టీవీ9 నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చినంత మాత్రాన ఆయన .. తెలుగు మీడియాకు దూరమయ్యే అవకాశం లేదు. ఆయన తన ముద్రను.. మరో రకంగా.. బలంగా చూపించే అవకాశం ఉంది. అది ఎలా చూపిస్తారనేది ఆసక్తికరం. కొత్తగా టీవీ చానళ్లను ప్రారంభిస్తారా..? లేక… తనదే అని ప్రచారంలో ఉన్న మోజో టీవీపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారా..?. లేక ఇంకేమైనా ప్రణాళికలు ఉన్నాయా.. అనేది.. ఎవరికీ అంతుబట్టడం లేదు.

ప్రత్యామ్నాయ ఆలోచనలు ఎప్పుడో చేశారా..?

కానీ.. శ్రీనిరాజు… టీవీ9 అనే బంగారు బాతును అమ్మేసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచే… రవిప్రకాష్.. వీలైనంతగా జాగ్రత్త పడటం ప్రారంభించారు. టీవీ9 స్వతంత్ర జర్నలిస్టుల చేతుల్లో ఉండేలా చూసేందుకు శతథా ప్రయత్నించారు. కానీ.. ఊహించని విధంగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. టీవీ 9 అమ్మకం ఆలోచన చేస్తున్నప్పటి నుంచే.. రవిప్రకాష్ … ప్రత్యామ్నాయ ఆలోచనలు చేశారన్న ప్రచారం కూడా మీడియాలో జరిగింది. ఆ ఆలోచనల నుంచే మోజో టీవీ పుట్టిందని అంటున్నారు. ఇప్పుడు రవిప్రకాష్.. ఫ్రెష్‌గా ఈ టీవీపై కాన్‌సన్‌ట్రేట్ చేస్తారా.. లేక… కొత్త ఆలోచనలతో మరో కొత్త వెంచర్‌ను ప్రారంభిస్తారా.. అనేది కీలకమైన అంశం.

మరో “టీవీ9” సృష్టించే ఆలోచన చేస్తారా..?

రవిప్రకాష్ అనేది ఓ బ్రాండ్. ఆయన టీవీ చానల్ పెట్టి.. సొంతంగా.. బ్రాండింగ్ చేసుకుంటే… తెలుగు ప్రేక్షుకల మనసుల్లోకి సులువుగా వెళ్లిపోతుంది. రవిప్రకాష్‌ను తిట్టేవారున్నా.. పొగిడేవారున్నా… అందరూ.. ఆయన చానల్‌ను మాత్రం చూస్తారు. ఓ టీవీకి కావాల్సింది కూడా అదే. రవిప్రకాష్ పై ఆ సహజమైన క్యూరియాసిటీ ప్రజల్లో ఉంది. ఆయన ఓ కొత్త చానల్‌తో తెర ముందుకు వస్తే మాత్రం… తెలుగు రాష్ట్రాల్లో… మరో సంచలనం ప్రారంభమవడం ఖాయం. మరి రవిప్రకాష్ ఆలోచనలేమిటో.. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com