పెళ్లి చూపులుతో న్యూ ఏజ్ సినిమా ఎలా ఉంటుందో రుచి చూపించాడు తరుణ్ భాస్కర్. ఆ తరవాత కొత్తతరం దర్శకులు ఎక్కువగా సహజత్వాన్ని నమ్ముకొని సినిమాలు తీయడం మొదలెట్టారు. అడపా దడపా ఇలాంటి ప్రయత్నాలు ప్రేక్షకులు, విమర్శకుల మెచ్చుకోళ్లని అందుకొంటున్నాయి. ఇప్పుడు `వాట్సప్ నరేష్` కూడా ఈ జాబితాలో చేరే సినిమా అవుతుందన్న నమ్మకాన్ని కలిగించింది. కావ్య కల్యాణ్ రామ్, అన్వేష్ జంటగా నటించిన సినిమా ఇది. సీవీ విశాల్ దర్శకుడు. భాగ్యలక్ష్మి నిర్మాత. గ్లింప్స్ విడుదలైంది. ఓ అమ్మాయి, అబ్బాయి కాఫీ షాప్ లో కూర్చుని డేటింగ్ యాప్స్ గురించీ, రిలేషన్స్ గురించి మాట్లాడుకొన్న సన్నివేశాన్నే.. గ్లింప్స్ రూపంలో తీసుకొచ్చారు. ఆ సంభాషణ చాలా సహజంగా, ఈతరం జంజీ కిడ్స్ కి నచ్చేలా ఉంది. నిజంగానే ఓ జంట మధ్యలో కెమెరా పెట్టినంత ఆహ్లాదకరంగా సాగింది ఆ సంభాషణ. కావ్య ఇది వరకు చాలా సినిమాలే చేసింది. అన్వేష్ కొత్తగున్నాడు. గ్లింప్స్ లో కనిపించిన కెమెరా వర్క్, సౌండ్ డిజైనింగ్, నేపథ్య సంగీతం ఇవన్నీ ఆకట్టుకొన్నాయి. కచ్చితంగా న్యూ ఏజ్ సినిమా అనిపిస్తోంది.
ప్రేమ, మానవ సంబంధాల గురించి ఈతరం ఎలా ఆలోచిస్తుందో ఈ సినిమాలో చూపిస్తున్నామని మేకర్స్ అంటున్నారు. గ్లింప్స్ లోనూ అదే కనిపించింది. ఓ యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ప్రామిసింగ్ ప్రయత్నంలానే అనిపించింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటైల్స్ బయటకు రానున్నాయి.
