విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28వ తేదీన విశాఖ బంద్ పాటించాలని కార్మికులు నిర్ణయించారు. విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ మేరకు పిలుపునిచ్చాయి. మొదట్లో రాజకీయ పార్టీలు ఉద్యమించినా తర్వాత చల్లబడిపోయారు ఇప్పటి వరకూ కార్మికులు, ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు చేస్తూ పోరాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్రం ప్రైవేటీకరణ చేస్తూంటే మమ్మల్ని ప్రశ్నిస్తారేమిటని వైసీపీ ప్రభుత్వం, మంత్రులు ప్రశ్నిస్తున్నారు.
కానీ ప్రభుత్వంగా గట్టిగా వ్యతిరేకిస్తే కేంద్రం కూడా ప్రైవేటీకరణ చే్యడానికి వెనుకంజ వేస్తుంది. కానీ గట్టిగా వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. ఆ స్టీల్ ప్లాంట్ ప్రజల ఉద్యమం ఫలితంగా ఏర్పాటయింది. అంతే కాదు భూమి ప్రజలు ఇచ్చింది. కొంత స్వచ్చందంగా ఇచ్చారు. మరికొంత సేకరించారు. అందుకే కేంద్రానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తగదని అల్టిమేటం జారీ చేస్తే కేంద్రం కూడా వెనక్కి తగ్గక తప్పదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రవేటీకరణకు సహకరిస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది.
అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు సైలెంట్ అయ్యాయి. ఇటీవలే పవన్ కల్యాణ్ బ్యాటన్ అందుకున్నారు. ఓ బహిరంగసభ..మరో దీక్ష నిర్వహించారు. అన్ని పార్టీలూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కలిస్తే మరోసారి ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ ఎన్ని పార్టీలు ఇప్పుడు ముందుకు వస్తాయనేది కీలకమైన అంశంగా మారింది.