భారత్ తో యుద్ధం వద్దురో మొర్రో అని అక్కడి ప్రజలే చెప్తున్నా పాక్ సైన్యం వినడం లేదు. అదేపనిగా ఇండియాను కెలుకుతోంది. డ్రోన్లు, మిస్సైళ్ళ ద్వారా దెబ్బకొట్టాలని విఫలయత్నం చేస్తోంది. సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, భారత్ మరింత ముందడుగు వేస్తుందని పాక్ మేలు కోరి కొంతమంది చెబుతున్నారు. అయినా సైన్యం చెవికెక్కించుకోవడం లేదు. దీంతో అసలు పాక్ బలం , బలగం ఏంటి? అనే చర్చ జరుగుతోంది.
పాక్ కు చైనా సహకారం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ పిచ్చిచేష్టలకు దిగుతోందని ప్రచారం జరుగుతోంది. భారత్ తో యుద్దమంటూ కోరుకుంటే పట్టుమని పదిరోజులు కూడా పాక్ యుద్ధం చేయకుండా అస్త్రసన్యాసం చేయడం ఖాయం. ఈ విషయం పాక్ సైన్యానికి కూడా తెలుసు. అయినా యుద్దానికి దారితీసేలా భారత్ తో పాక్ తలపడటానికి చైనా కారణం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ – పాక్ విషయంలో చైనా ఎటువైపు మొగ్గకుండా పరిస్థితులను గమనిస్తోంది. కానీ, ఖచ్చితంగా పాక్ వైపు ఉండదని చెప్పలేం. అలాగని ఇండియాకు మద్దతుగా ఉంటుందని కూడా చెప్పలేం.
అయితే, ఆసక్తికర విషయం ఏంటంటే పాక్ , పీవోకేలో చైనా పెట్టుబడులు కూడా పెట్టింది. అలాగే , అమెరికా టారిఫ్ వార్ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ లో చైనాకు పోటీగా భారత్ తయారు అవుతోంది. వీటన్నింటి దృష్ట్యా చైనా తన మద్దతును పాకిస్తాన్ కు ఇవ్వొచ్చు. వీటిని పసిగట్టే భారత్ ను పాక్ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందని అంటున్నారు. చైనాను చూసుకొని విర్రవీగితే యుద్ద అనంతర పరిస్థితులను చక్కదిద్దుకోవడం పాక్ కు పెనుసవాల్. వాటి గురించి ఆలోచించకుండా చైనాను చూసి వాతలు పెట్టుకునేలా పాక్ దుందుడుకు చర్యలకు దిగుతోందని అంటున్నారు.