హైదరాబాద్ నగరానికి అల్లు సినిమాస్ రూపంలో మరో ప్రత్యేకత సంతరించుకొంది. డాల్బీ సినిమా సాంకేతికతో రూపొందించిన అతి పెద్ద మల్టీప్లెక్స్‌లలో ఇది ఒకటి. ఇలాంటి సాంకతికతో తయారైన థియేటర్లలో దేశంలోనే మొదటిది. ఈ మల్టీప్లెక్స్ వెనుక మూడేళ్ల కృషి ఉంది. అల్లు అరవింద్ కు ఈ ఆలోచన రావడం వెనుక రెండు బలమైన కారణాలు ఉన్నాయి.
యూవీ సంస్థ సూళ్లూరి పేటలో ఓ భారీ మల్టీప్లెక్స్ నిర్మించారు. ఆ మల్టీప్లెక్స్ చూసొచ్చిన అల్లు అరవింద్ ‘ఎప్పటికైనా అలాంటి థియేటర్ కట్టాలి’ అనుకొన్నార్ట. ఓసారి పారిశ్రామిక వేత్త అల్లు అరవింద్ కి ఫోన్ చేసి `మిషన్ ఇంపాజిబుల్ సినిమాకు ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో నాలుగు టికెట్లు కావాలి.. ఇప్పిస్తారా` అని అడిగార్ట. పెద్ద పెద్ద స్క్రీన్ లో సినిమా చూడడం, ఆ సాంకేతికతను ఆస్వాదించడాన్ని ఈతరం బాగా ఇష్టపడుతుందన్న విషయం ఆ రోజు అరవింద్ కి అర్థమైందట. అప్పుడే ‘ఇలాంటి థియేటర్ ఎప్పటికైనా కట్టాలి’ అని ఫిక్సయ్యారని.. ఈ రెండు ఉదంతాలు అల్లు సినిమాస్ ఏర్పాటుకు పునాదులు వేశాయని.. అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. ‘దురంధర్ 2’తో అల్లు సినిమాస్‌లో వినోదాలు మొదలు కానున్నాయి. కోకాపేట చుట్టుపక్కల ఉన్న సినీ ప్రేమికులకు ఇక నుంచి అల్లు సినిమాస్ ఒక అడ్డాగా మారబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
